Anna Raghu, Guntur, News18
రాజకీయ నాయకులు, అధికారుల మధ్య సమన్వయంతోనే ప్రభుత్వాలు నడుస్తాయి. సాధారణంగా ప్రజాప్రతినిథుల నిర్ణయాలకు అనుగుణంగానే అధికారులు పనిచేస్తారు. కానీ ప్రస్తుత రోజుల్లో తప్పైనా ఒప్పైనా.. ఒక ప్రజాప్రతినిథి ఏం చెబితే అదే శాసనంగా చెల్లుబాటవుతుందనడంలో సందేహం లేదు. తాజాగా ఓ ఐపీఎస్ అధికారి ఇచ్చిన నివేదికను.. ఓ ఎమ్మెల్యే కారణంగా పక్కనబెట్టడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా (Guntur District) వినుకొండ నియోజకవర్గంలో అధికారపార్టీకే చెందిన నరేంద్ర అనే రైతు రైతు భరోసా కేంద్రంలో తమ పంటలు కొనడం లేదని స్థానిక శాసనసభ్యుడు బొల్లా.బ్రహ్మనాయుడిని అడుగగా ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ రైతుపై చెప్పు విసిరి దాడికి పాల్పడిన సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఐతే రైతు నరేంద్రను అంతటితో వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే తన పీఏ ద్వారా నరేంద్రపై హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపించారన్న ఆరోపణలున్నాయి. ఐతే అదే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలు ఎమ్మెల్యేకు షాకిచ్చేలా చేశారు. రైతు నరేంద్రపై తప్పుడు కేసు పెట్టారని.., అందు తానే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నానని నిజానిజాలు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నరేంద్రకు న్యాయం చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి ఫోన్ లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఎంపీ ఫిర్యాదు మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని నరేంద్ర వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డికి విచారణ బాధ్యతలు అప్పగించారు. వినుకొండలో పర్యటించిన అడిషనల్ ఎస్పీ నివేదిక ఆధారంగా ఒత్తిడులకు తలొగ్గి రైతు నరేంద్రపై స్థానిక సీఐ తప్పుడు కేసు బనాయించారని నివేదిక ఇవ్వడంతో వినుకొండ సిఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్యపోరు బహిర్గతమైంది.
ఐతే తన కోసం పని చేసిన సీఐపై సస్పెన్షన్ వేటు పడటంతో తన పరపతికి భంగం కలుగుతుందని భావించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రాంగం ఫలించడంతో సిఐ రమేష్ పై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.
అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి నివేదిక ఆధారంగా సిఐ రమేష్ పై సస్పెన్షన్ విధించిన అధికారులు ఇప్పుడు రాజకీయ ఒత్తిడులతో సస్పెన్షన్ ఎత్తివేయడం ఐపిఎస్ వర్గాలలో చర్చకు దారితీసింది. ఒక ఏపీఎస్ అధికారి నివేదికకు విలువ లేనప్పుడు అసలు విచారణ జరపడం ఎందుకు తమని ప్రజలలో పలుచన చేయడం ఎందుకని అధికారులు చర్చించుకుంటున్నారు. సీఐపై సస్పెన్షన్ ఎత్తివేయడం అంటే అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ నివేదికలో నిజం లేదనే భావన ప్రజలలోకి వెళుతుందని,ఇలాంటి ఘటనల వలన పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజలలో మరింత చులకన భావం ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు రాజకీయనాయకుల మధ్య ఆధిపత్యపోరు వలన పోలీసు డిపార్ట్మెంట్ పరువు నడిబజారున పడినట్లైందని పేరు తెలుపటానికి ఇష్టపడిని అధికారి అన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కెరీర్ ప్రారంభదశలో ఉన్న అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి కెరీర్ పై తీవ్రప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp