ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...

AP Assembly Election 2019 : సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజున తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలే ఇందుకు ఆజ్యం పోసే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎందుకీ పరిస్థితి? ఫలితాలు ప్రశాంతంగా వెల్లడి కావా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 9, 2019, 8:29 AM IST
ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...
ఈవీఎం, వీవీప్యాట్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలాంటి హింస చెలరేగిందో కళ్లారా చూశాం. ఏకంగా ప్రాణాలే పోయాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఎంతో ముందుండే ఏపీలో ఈ పరిస్థితి రావడానికి టీడీపీయే కారణం అని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తే, వైసీపీయే కారణం అని అధికార టీడీపీ నేతలు ఆరోపించారు. అటు తిరిగీ, ఇటు తిరిగీ ఎన్నికల సంఘం అసమర్థత వల్లే ఇదంతా జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. దాంతో ఈసీపై సహజంగానే విమర్శలొచ్చాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరిప్పుడు ఫలితాల రోజు ఏం జరగబోతోంది?

మే 23న ఏం జరుగుతుందంటే : ఈవీఎంలను మాత్రమే లెక్కించే విధానంలో... ఉదయం 10 గంటల కల్లా ఏ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారో స్పష్టం అయ్యేది. మధ్యాహ్నం 12 గంటలకల్లా అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో కూడా తెలిసిపోయేది. ఈసారీ అలాగే జరిగే అవకాశం ఉంది... ముందుగా ఈవీఎంలను లెక్కిస్తారు కాబట్టి... మధ్యాహ్నం కల్లా ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో దాదాపు క్లారిటీ వస్తుంది. ఐతే... కొద్దిపాటి మార్జిన్‌తో అభ్యర్థుల గెలుపోటములు డిసైడైతే మాత్రం అలాంటి చోట వీవీప్యాట్ల లెక్కింపులో గందరగోళం తలెత్తే పరిస్థితి ఉండొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇందుకు ప్రధాన కారణం వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కించడమే. ఇదేమంత తేలికైన విధానం కాదు. మాన్యువల్‌గా (మనుషులతో పని) చేసే పని. ఈవీఎంలైతే యంత్రాలు కాబట్టి... ఎన్ని ఓట్లు పోలైందీ బటన్ నొక్కగానే ఆన్సర్ వచ్చేస్తుంది. లెక్క తేలిపోతుంది. అదే వీవీప్యాట్లైతే... స్లిప్పులను మనుషులు లెక్కిస్తారు కాబట్టి కచ్చితంగా తప్పులు దొర్లుతాయంటున్నారు కొందరు.

ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం... ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 5 వీవీప్యాట్ మెషిన్లలోని స్లిప్పులను లెక్కించి... ఈవీఎంలలోని ఓట్లతో సరిచూడాలి. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే....


* ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈవీఎంలలోనూ పోలైన ఓట్లను లెక్కిస్తారు. అందువల్ల ముందే ఫలితం తెలిసిపోతుంది. ఏ పార్టీ అభ్యర్థి గెలిచిందీ క్లారిటీ వచ్చేస్తుంది.
* ఆ తరువాత మొత్తం వీవీ ప్యాట్‌లను ఏజెంట్ల ముందుకు తీసుకువస్తారు. ఆ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లతో రూపొందించిన ఫారమ్-17తో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోలుస్తారు.
* ఆ తర్వాత లాటరీ ద్వారా ఏవైనా 5 వీవీప్యాట్ యంత్రాల్ని ఎంచుకుంటారు. ఇదంతా ఆయా పార్టీల అభ్యర్థులు చూస్తున్నప్పుడే జరుగుతుంది.* ముందుగా స్లిప్పులను ఏజంట్ల ముందే బయటకు తీసి, అభ్యర్థుల వారీగా వేరు చేస్తారు. 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు.
* ఒకే సమయంలో ఐదు వీవీ ప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను వేర్వేరు టేబుళ్లపై లెక్కిస్తారు. ఇదంతా పూర్తి కావడానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది.
* ఈవీఎంలను లెక్కించే టేబుల్ పైనే ట్రేలను ఏర్పాటు చేసి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి తమ సిబ్బందికి ఈసీ ట్రైనింగ్ ఇస్తోంది.
* ఇలా లెక్కించే సమయంలో ఏజెంట్లు ఏ అభ్యంతరాలూ పెట్టకపోతే, ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా... స్లిప్పులు సరిగా లెక్కపెట్టట్లేదనో, కట్టలు సరిగా కట్టట్లేదనో ఏవైనా అభ్యంతరాలు చెబితే మాత్రం కౌంటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. ఈ సమయంలో ఏవైనా ఆందోళనలూ, గొడవలూ జరిగితే... అసలుకే ఎసరు తప్పదు.

కట్టుదిట్టమైన భద్రతను పెట్టి లెక్కిస్తే తప్ప, ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా వెల్లడించే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. ఐతే టీడీపీ సహా 21 పార్టీలు... 50 శాతం వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్పులను లెక్కించాలని కోరుతున్నాయి. అందుకు గనక కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే... గందరగోళం మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజంగా వీవీప్యాట్లు సరిగా పనిచెయ్యకపోయి ఉంటే... నియోజకవర్గానికి 5 వీవీప్యాట్ యంత్రాల్ని పరిశీలించినా సరిపోతుందంటున్నారు టెక్నికల్ ఎనలిస్టులు. ఈ పరిస్థితులు, పరిణామాలూ కలిసి... ఎన్నికల ఫలితాలు ప్రశాంతంగా వెల్లడవుతాయో లేదో అన్న ఆందోళన ప్రజలతోపాటూ పార్టీల్లోనూ కనిపిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

చంద్రబాబు ప్రధాని అవ్వగలరా...? ఉండవల్లి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటి ?

సహజీవనం పెళ్లితో సమానం... రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు...
First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు