ISI Honey Trap : భారత నౌకాదళంలో డిసెంబర్లో బయటపడిన హనీట్రాప్ వ్యవహారంపై NIA దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఈ హనీట్రాప్ వెనక పాకిస్థాన్ గూడఛార సంస్థ ISI హస్తం ఉన్నట్లుగా NIA అనుమానిస్తోంది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నౌకాదళ సిబ్బందికి చిన్న మొత్తాల్లో డబ్బు ఇచ్చి... కీలక సమాచారం రాబట్టేందుకు ISI కుట్ర పన్నినట్లు తెలిసింది. ఐతే... నౌకాదళంలో కింది స్థాయి సిబ్బందికి... కీలకమైన డాక్యుమెంట్లలో డేటా, రహస్య సమాచారం ఏదీ తెలియకపోవడం వల్ల... ISIకి ఎలాంటి కీలక సమాచారమూ అందలేదని NIA భావిస్తోంది. ఐతే... నౌకలు లేదా విశాఖపట్నపు తూర్పు నౌకాదళ కమాండ్ లేదా ముంబైలోని పశ్చిమ నౌకాదళ కమాండ్‌కి సంబంధించిన సమాచారం ఏదైనా కిందిస్థాయి సిబ్బంది నుంచీ ISI సేకరించిందా అన్నది త్వరలో తేలనుంది.
డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలూ కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి... 10 మంది సైలర్ల (Sailors)ను అరెస్టు చేశాయి. తద్వారా ఈ కుట్రపూరిత రాకెట్ బయటపడింది. నౌకాదళంలోని మరింత మంది కిందిస్థాయి ర్యాంకుల వారిని కూడా... హనీ ట్రాప్ ద్వారా ISI ట్రాప్ ఉంటుందన్న అనుమానాలున్నాయి.
పాకిస్థాన్ ఏజెంట్ల తరపున వేరే దేశాల్లో పనిచేస్తున్న కొంత మంది మహిళలు... ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో అందమైన ఫొటోలు పెట్టి... వాటిని నౌకాదళ సిబ్బందికి పంపి... హనీట్రాప్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు చూసి... అమ్మాయిల ఉచ్చులో పడిన నౌకాదళ కిందిస్థాయి సిబ్బంది... హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. ఒక్కసారి ఇలా పరిచయం అయ్యాక... ఆ అమ్మాయిలు... ఫ్రెండ్స్‌లా నటిస్తూ... నౌకాదళానికి చెందిన కీలక సమాచారం రాబట్టేందుకు యత్నించినట్లు తెలిసింది.
అసలీ అమ్మాయిలూ... నౌకాదళ సిబ్బంది మధ్య ఎలాంటి సంభాషణలూ, చాటింగ్ జరిగిందో తెలుసుకునేందుకు NIA ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా... అమెరికాలోని ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా సంస్థల నుంచీ సమాచారం రాబడుతోంది. రహస్య సమాచారం సేకరించేందుకు సైలర్లకు ఆ అమ్మాయిలు ఎక్కువ మొత్తం ఇవ్వలేదనీ... రూ.5000 నుంచీ రూ.10000 మధ్యే హవాలా మార్గంలో డబ్బు ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అరెస్టైన ప్రతీ వ్యక్తి పర్సనల్ బ్యాంక్ అకౌంట్నీ NIA పరిశీలిస్తోంది.
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సముద్రాలపై నిఘా వ్యవహారాల్ని తూర్పు నౌకాదళం, పశ్చిమ నౌకాదళం చూసుకుంటున్నాయి. వీటిలో రహస్యాలు తెలుసుకోవడం ద్వారా... ఇండియాలోకి చొచ్చుకొచ్చేందుకు ఉగ్రవాదులకు వీలవుతుంది. అందుకే పాకిస్థాన్ ISI హనీట్రాప్‌కి పాల్పడినట్లు అనుమానాలున్నాయి. ఐతే... ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక... నౌకాదళంలో ఎవ్వరూ కూడా సోషల్ మీడియా అకౌంట్లు వాడకూడదనే ఆర్డర్ జారీ అయ్యింది.