జనసేన పోటీ వెనక చంద్రబాబు వ్యూహం..? పక్కా ప్లాన్‌తో అంతా జరుగుతోందా..?

AP Assembly Election Counting 2019 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి టైమ్ దగ్గర పడుతుంటే ఓ కొత్త విషయం రాజకీయంగా కలకలం రేపుతోంది. అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమే జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 6:45 AM IST
జనసేన పోటీ వెనక చంద్రబాబు వ్యూహం..? పక్కా ప్లాన్‌తో అంతా జరుగుతోందా..?
టీడీపీ అధినేత చంద్రబాబు (File)
  • Share this:
సాధారణంగా ఐదేళ్లు పాలించిన ఏ ప్రభుత్వంపైనైనా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రజల్లో ప్రభుత్వంపై అభిమానం పెరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో అక్కడి ప్రజల్లో అభిమానం పెరిగిందంటే దానర్థం... అక్కడి ప్రభుత్వం వారు కోరుకున్నదానికంటే మెరుగ్గా పనిచేసిందనే. మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో అలా జరగట్లేదా. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పనిచెయ్యలేదా? ఓడిపోతామన్న ఉద్దేశంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా ప్లాన్ వేసి... ఏడాది కిందటే దాన్ని అమలు చేశారా? ఇదే ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు తెరతీసింది. జనసేన ఎన్నికల్లో పోటీ చేయడం, కాంగ్రెస్-టీడీపీ వేటికవే విడివిడిగా బరిలో దిగడం అన్నీ చంద్రబాబు వేసిన ఎత్తుగడలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి తమకు సీట్లు తగ్గవచ్చని భావించిన చంద్రబాబు... ప్రజా వ్యతిరేక ఓట్లు వైసీపీకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం వ్యూహాన్ని అమలు చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే జనసేనను దూరం పెట్టి... ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేలా ప్లాన్ వేశారన్న ఆరోపణలున్నాయి. తద్వారా ప్రజా వ్యతిరేక ఓటు వైసీపీకి వెళ్లకుండా జనసేనకు వెళ్తుందని చంద్రబాబు ఆలోచించారని తెలుస్తోంది. ముఖ్యంగా కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం ఆందోళనల వల్ల... కాపు వర్గం ఓట్లు వైసీపీకి వెళ్తే, గోదావరి జిల్లాల్లో టీడీపీ అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న ఉద్దేశంతో... ఆ వర్గం ఓట్లను రాబట్టుకునేందుకు జనసేనను ఎన్నికల్లో విడిగా పోటీ చేయించారనీ, ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన తిరిగి కలిసిపోవడమో, లేదంటే టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడమో కచ్చితంగా జరుగుతుందంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. కేంద్రంలో తిరిగి కాంగ్రెస్+మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు... రాష్ట్రంలో తాము తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీకి పడే ప్రజా వ్యతిరేక ఓట్లను చీల్చేలా ఏపీలో కాంగ్రెస్ కృషి చెయ్యాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రజా వ్యతిరేక ఓట్లు చీలి... వైసీపీ అడ్డంగా లాసైతే... ఎన్నికల తర్వాత మిత్రపక్షాల్ని దగ్గరకు చేర్చుకొని... అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఏడాది కిందటే స్కెచ్ వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

టీడీపీ నుంచీ వీడిపోయినప్పుడు జనసేన పార్టీ... ఏపీ ప్రత్యేక హోదా అంశాన్నే బలంగా వినిపించింది. తీరా ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు మాత్రం వీలైనంతవరకూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తకుండా... టీడీపీకి పరోక్షంగా లబ్ది చేకూర్చిందన్న విశ్లేషణ వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక హోదా అంశాన్నే బలంగా వినిపించి ఉంటే... అది టీడీపీకి ఇబ్బందికర పరిణామం కాబట్టి... రెండు పార్టీలకూ ప్రత్యర్థి అయిన వైసీపీనీ, పక్క రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్‌నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఇలా అంతా చంద్రబాబు చెప్పినట్లే జరుగుతోందనీ, ఈ వ్యూహం సక్సెస్ అయితే మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చి, వైసీపీ మళ్లీ ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల్లో ఎవరైతే తెలివైన వ్యూహాలు రచిస్తారో వాళ్లకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఫలితాలు వచ్చే వరకూ ఇలాంటి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ నిపుణులు. ఇలాంటి వాటికి ఆధారాలు లేకపోయినా, ఇది నిజమే కావచ్చన్న భావన మాత్రం ప్రజల్లో కలుగుతోంది. 

ఇవి కూడా చదవండి :

కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే... పూర్తి వివరాలు ఇవిగో...ఫలితాల కోసం వైసీపీ సన్నద్ధం... టీడీపీ తీరుపై ఆందోళన...

టీడీపీ, వైసీపీ... రెండు పార్టీలకూ 100కు పైనే... నకిలీ సర్వేలపై ప్రజల ఆగ్రహం...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు