IS TDP FAILED TO GAIN PEOPLE ATTENTION ON EMPLOYEES PRC ISSUE FULL DETAILS HERE PRN GNT
TDP: ఆ విషయంలో టీడీపీ సెల్ఫ్ గోల్..? కొసరు విషయానికి వెళ్లి.. అసలు విషయం మరిచారా..?
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగుతోంది. ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగుతోంది. ప్రతి అంశంలోనూ రెండు పార్టీలు తగ్గేదేలే అన్నట్లుగా ముందుకెళ్తున్నాయి. ఐతే ఇటీవల ఓ కీలక అంశంలో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా..? అనే చర్చ జరుగుతోంది. అదే పీఆర్సీ అంశం. గడచిన రెండు నెలలుగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు జీతాలుపెంచమంటూ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఓ కోలిక్కి వచ్చినట్టేనని అంతా భావించారు. ఐతే ప్రభుత్వం ఇస్తానన్న కొత్త పిఆర్సీ వల్ల తాము నష్టపోతున్నామని, తమ డీ.ఏ బకాయిలతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న 27% ఐఆర్ ప్రకారమే తమజీతాలు చెల్లించాలంటూ ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించారు.
ఐతే ఉద్యోగుల అభ్యర్ధనను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం కొత్త పీఆర్సీ ని ఆమలులోకి తెస్తూ జీఓ విడుదల చేసింది. దీంతో భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో అమీతుమీకి తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి.మరోసారి చర్చలకు రావాలంటూ సీఎంఓ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని సైతం తిరస్కరించి సమ్మెబాట పట్టాలని తీర్మానించుకున్నారు. సోమవారం జీఏడీ కార్యదర్శికి నోటీసులు కూడా అందజేశాయి.
ఇంతటి భారీ అవకాశం కళ్ళముందు కనిపిస్తుంటే సద్వినియోగం చేసుకోవలసిన టీడీపీ.., మంత్రి కొడాలి నానిపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని బయట పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ లో క్యాసినో నిర్వహించిన అంశాన్ని టీడీపీ నెత్తికెత్తుకుని ఉద్యోగుల ఉద్యమం గురించి పట్టించుకోవడం మానేసిందనే చెప్పాలి.
టీడీపీ అసలు సమస్యను మరిచిపోయి క్యాసినో వైపు మళ్ళించడంలో మంత్రి కొడాలి నాని కొంత వరకు విజయం సాదించారనే చెప్పుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ మీద ఒంటికాలుమీద పైకి లేస్తున్న కొడాలి.నాని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కడంతో రాష్ట్ర టీజీపీ నాయకత్వం మొత్తం తమ దష్టిని గుడివాడపైనే పెట్టింది.
ఐతే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి టీడీపీ మద్దతు దొరకకుండా చేయడానికి మంత్రి కొడాలి నాని ఇష్యూని వాడుకుని వైసీపీ కొంతమేర విజయం సాధించినట్లే కనపడుతుంది. తమ విషయంలో కలుగజేసుకోవద్దని ఉద్యోగులు తేల్చిచెప్పడం కూడా టీడీపీకి బ్రేక్ పడింది. ఐతే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ విఫలమైందన్నది మాత్రం వాస్తవం. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు సమ్మెకే సిద్ధమైనందున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.