చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత

AP Assembly Elections 2019 : సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు నుంచీ కొత్త పథకాలు తెచ్చి డబ్బులు ఇస్తుండటంపై వైసీపీ నేతలకు అనుమానాలు తలెత్తుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 7, 2019, 5:53 AM IST
చంద్రబాబు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారా... వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత
టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్న చంద్రబాబు
  • Share this:
సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీలు... పన్నులు ఎగ్గొట్టడానికి చార్టర్డ్ అకౌంటెంట్ల(CA)పై ఆధారపడతాయి. కొందరు సీఏలు... పన్ను ఎగ్గొట్టేలా చేసేందుకు ఖర్చుల లెక్కలు పెంచుతారు. ఖర్చులు ఎంత పెరిగితే ఆదాయం అంతలా తగ్గి... ఎక్కువ టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ డబ్బును బ్లాక్ మనీగా మార్చుకుంటాయి కొన్ని కంపెనీలు. దీనికి రివర్స్ స్ట్రాటజీని టీడీపీ అధినేత చంద్రబాబు ఫాలో అవుతున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. అంటే, సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు... చంద్రబాబు తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసి... దాన్ని ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూగా చూపెడుతూ... ఆ డబ్బును పథకాల రూపంలో ప్రజలకు పంచిపెడుతున్నారన్నది వైసీపీ నేతల తాజా ఆరోపణ. నిరుద్యోగ భృతి, పెన్షన్లు, పసుపు-కుంకుమ ఇలా చాలా పథకాలకు ఇస్తున్న డబ్బంతా... ఐదేళ్లుగా చంద్రబాబు పోగేస్తున్న బ్లాక్ మనీ నుంచీ తీసినదే అంటున్నారు వైసీపీ నేతలు. ఇందుకు వాళ్లు ఓ బలమైన కారణం చెబుతున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని పదే పదే చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టును కట్టేందుకు, రాజధాని అమరావతిని నిర్మించేందుకు, ఇతర భవనాల నిర్మాణాలకూ దేనికీ డబ్బు లేదనీ, కేంద్రం నుంచి కూడా నిధులు రావట్లేదనీ అందుకే ఎన్నో పనులు చెయ్యాల్సి ఉన్నా... ముందుకు వెళ్లలేకపోతున్నామనీ... చంద్రబాబు ఇదివరకు చాలా సందర్భాల్లో చెప్పిన మాటల్ని వైసీపీ నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ఎక్కడి నుంచీ పథకాలకు ఇంతింత డబ్బులు తీసుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.


సాధారణంగా ఎన్నికల సమయంలో ఆయా పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు బ్లాక్ మనీని బయటకు తీసి... సీక్రెట్‌గా పంచిపెడతాయి. చంద్రబాబు మాత్రం తెలివైన వ్యూహం పన్ని... బ్లాక్ మనీని ప్రభుత్వ ఆదాయంగా చెబుతూ... దాన్ని ప్రజలకు పథకాల వంకతో పంచేస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ.

ప్రభుత్వం ఏం చెబుతోంది : సీఎం చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం... ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఆ వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ... హామీల అమలు దిశగా ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పాలిస్తున్నామంటున్న ఆయన... మరింత సంపదను పెంచి, మరింత ఎక్కువ డబ్బులు పంచుతానని అంటున్నారు. తిరిగి అధికారంలోకి రాగానే... నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచీ రూ.3వేలకు పెంచుతాననీ, ఆడపడుచుల పెళ్లికి ఇస్తున్న రూ.50వేలను అధికారంలోకి వచ్చాక రూ.లక్ష చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇలా ప్రతీ పథకానికీ నిధులను ఇంకా ఇంకా పెంచుతున్నారే తప్ప వెనక్కి తగ్గట్లేదు. భారీ పరిశ్రమలు, కంపెనీలను తీసుకురావడం ద్వారా నిధులు సేకరిస్తామంటున్నారు. అలాగే రాజధానికి ఇచ్చిన 30 వేల ఎకరాల్లో సగం భూముల్ని అమ్మడం ద్వారా వచ్చే రెవెన్యూని రాష్ట్ర అభివృద్ధికీ, పథకాలకూ ఉపయోగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అందువల్ల అసలు బ్లాక్ మనీ అన్న మాటే లేదనీ... ఇదంతా వైసీపీ నేతలు ఆడుతున్న మరో డ్రామా అనీ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.ఇలా బ్లాక్ మనీ అంశం ఎన్నికల వేళ కలకలం రేపుతోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ... రెండు పార్టీల నేతలూ ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. ఎవరి వాదన నిజమన్నదానిపై ఎవరూ ఆధారాలు సమర్పించే అవకాశాలు కనిపించట్లేదు. ఎన్నికల హడావుడిలో ఈ ఆరోపణల పర్వం అలా సాగిపోతోంది.

 

ఇవి కూడా చదవండి :టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు... టీడీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే...

YSRCP Manifesto Highlights : వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే...

ఎన్నికల సభలకు వస్తున్న ప్రజల్లో నాలుగు రకాలు... మీరు ఏ టైపో తెలుసుకోండి...
First published: April 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు