Home /News /andhra-pradesh /

అన్న, రాజన్న.. పేరేదైనా క్యాంటీన్ క్లోజ్ అయిపోతుందా...

అన్న, రాజన్న.. పేరేదైనా క్యాంటీన్ క్లోజ్ అయిపోతుందా...

అన్న క్యాంటీన్‌ను రాజన్న క్యాంటీన్‌గా మార్చినట్టుగా వైరల్ అయిన ఫొటో

అన్న క్యాంటీన్‌ను రాజన్న క్యాంటీన్‌గా మార్చినట్టుగా వైరల్ అయిన ఫొటో

అన్న క్యాంటీన్లకు అన్నం సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ కి ప్రభుత్వం కోట్లలో బకాయి ఉంది. దీంతోపాటు జూలై 31 వరకు అన్న క్యాంటీన్ నిర్వహించేందుకు హరేకృష్ణ ఫౌండేషన్‌కు కాంట్రాక్ట్ ఉంది.

    ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా అన్న క్యాంటీన్లు మూసివేత దిశగా సాగుతున్నాయి. శనివారం ప్రకాశం జిల్లా గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తిలో క్యాంటీన్లకు తాళాలు వేశారు.శనివారం మధ్యాహ్నం నుంచే వరుసగా క్యాంటీన్లు మూసివేశారు. టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు పేరిట పేదలకు రూ.5కే భోజనం అందించడానికి వీటిని ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి పేరు రాజన్న క్యాంటీన్లుగా మార్చింది. కొన్నిచోట్ల ఇప్పటికే గతంలో ఉన్న క్యాంటీన్లకు ఉన్న పసుపు రంగును మార్చి.. తెలుపు రంగును వైసీపీ ప్రభ్యత్వం మార్చింది.

    బకాయిలు చెల్లించలేక మూసివేస్తున్నారా? లేక రాజకీయాలే కారణమా?
    సాధారణంగా ప్రభుత్వం మారినప్పుడు వారికి అనుకూలమైన విధంగా ప్రభుత్వ పథకాల పేర్లు, భవనాల రంగులు మార్చుకునే రాజకీయ సంప్రదాయం ఏపీలో కొత్తకాదు. కానీ, పేరు మార్చినా? పథకాలను మాత్రం నిలిపివేసే సంస్కృతి చాలా తక్కువ. కానీ, అన్న క్యాంటీన్ల మూసివేతపై అనుమానాలు ముసురుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. అక్కడ ఇప్పటికే అన్న. క్యాంటీన్ కి ఉన్న పసుపు రంగు తొలగించి వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుపు రంగును కూడా వేశారు. కానీ, అధికారులు నిన్న అన్న క్యాంటీన్ కు తాళం వేశారు. గిద్దలూరు, అద్దంకి లోని క్యాంటీన్ లో ఉన్న అన్నం సరఫరా చేసే వంట సామాన్లు, ప్లేట్లు, సీసీటీవీలు అన్నీ వస్తువులను స్థానిక మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు.రంగు మార్చడం కోసం క్యాంటీన్ మూసివేశారు అనుకున్నా? గిద్దలూరులో క్యాంటీన్ లో ఎప్పుడో రంగు మార్చి భోజనం కూడా నెలరోజుల నుంచి సరఫరా చేస్తున్నారు. కానీ, అక్కడ క్యాంటీన్ ని పూర్తిగా ఖాళీచేయించడం అనుమానాలకు దారి తీస్తోంది.

    మరోవైపు.. ఇప్పటికే అన్న క్యాంటీన్లకు అన్నం సరఫరా చేసే హరే కృష్ణ ఫౌండేషన్ కి ప్రభుత్వం కోట్లలో బకాయి ఉంది. అవి చెల్లించకపోవడంతో నెల రోజుల నుంచి క్యాంటీన్ లో పెరుగు, మజ్జిగ ఏమీ లేకుండా? కేవలం సాంబారు, ఓ కూరతో రూ.5 కే భోజనం అందిస్తున్నారు. దీంతోపాటు జూలై 31 వరకు అన్న క్యాంటీన్ నిర్వహించేందుకు కాంట్రాక్ట్ ఉంది. ఒక్కో క్యాంటీన్ లో రోజుకి 1500 నుంచి 2000 మంది వరకు కూలి పనులు చేసుకునేవారు, నగరానికి పనుల కోసం వచ్చే పేదలు వీటిలో భోజనం చేస్తున్నారు.

    సోమవారం నుంచి జిల్లాలో అన్ని క్యాంటీన్లు బంద్.!
    సోమవారం మధ్యాహ్నం భోజనం అందించిన తర్వాత ఒంగోలు, చీరాల, కందుకూరు, పర్చూరుతో పాటు.. జిల్లాలోని అన్ని క్యాంటీన్లు అధికారులు మూసివేయనున్నారు. ఎందుకు మూసివేస్తున్నారని క్యాంటీన్లు నిర్వహిస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులను న్యూస్18 అడిగితే పురపాలక శాఖ నుంచి తమకు క్యాంటీన్లు మూసివేసి తాళాలు అధికారులకు అప్పగించమని ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. చూడాలి మూత బడుతున్న అన్న క్యాంటీన్లు... రాజన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకుని పేదలకు అన్నం అందిస్తాయో లేక రాజకీయ చట్రంలో ఇరుక్కుని ' మిడ్ డే మీల్స్ ' లా ప్రజలకు దూరం అవుతాయో తెలియాలి అంటే కొన్ని రోజులు వైయిట్ చెయాల్సిందే...!

    (డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Ongole, Prakasham dist

    తదుపరి వార్తలు