M Bala Krishna, News18, Hyderabad
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అటవీ జంతువుల (Wild Animals) దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా (Chittoo District) లో ఏనుగుల దాడులు, మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ఎలుగుబంట్ల దాడులు, కాకినాడ, అనాకపల్లి జిల్లాల్లో బెంగాల్ టైగర్ కలకలం. ఇలా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జంతువుల సంచారం అయితే పెరిగిపోతూ ఉంది. అయితే ఏటా ఈ జంతువుల చేతిలో ఏపీలో ఎంత మంది చనిపోతున్నారో తెలుసా ఏనుగులు, ఎలుగుబంట్లు, అడవి పందుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి సంవత్సరం 30 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2018లో రాష్ట్రంలో 31 మంది జంతువుల దాడిలో ప్రాణాలు కొల్పోయారు. NCRB ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యల డేటా ప్రకారం 2019లో జంతువుల దాడిలో 25 మంది చనిపోయారు ఈ సంఖ్య 2020లో 32 కు చేరుకుంది.
రాష్ట్రంలో అత్యధిక ప్రాణాలు తీస్తోన్న జంతువు ఏది అనేది ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొననప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఏనుగులు, ఎలుగుబంట్లు చేతిలో చాలా మరణాలు సంభవిస్తోన్నాయాని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండు మూడు జిల్లాల్లో ఏనుగులు కూడా చాలా మంది ప్రాణాలు తీస్తున్నాయని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.
ఇటీవల శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని కిడిసింగి సమీపంలో ఓ ఆడ ఎలుగుబంటి రైతును చంపి ఆరుగురిని గాయపరిచింది, కొన్ని పశువులను తీవ్రంగా గాయపరిచింది. అటవీ బృందం ఎలుగుబంటిని పట్టుకున్నప్పటికి దాన్ని వైజాగ్ జూకు తరలిస్తుండగా అది మృతి చెందింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల జంతువులు జన సంచారంలోకి వస్తున్నాయని అంటున్నారు అధికారులు.
ఇక శ్రీకాకుళం జిల్లాల్లో నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఆరు ఏనుగుల మంద కనిపించాయి. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం నుంచి అడవి ఏనుగుల సంచారం నిత్యకృత్యమైంది. విజయనగరం జిల్లాలో గత కొన్నేళ్లుగా ఏనుగులు ఆరుగురు రైతులను గాయపర్చడమే కాకుండా పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు 10 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయని డేటా చెబుతుంది. అటవీ భూమిని వివిధ అవసరాలకు కేటాయించడం ఇలాంటి పరిస్థితిలు దాపరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొందరు పర్యవరణ పరిరక్షణ కార్యకర్తలు.
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో అడవి ఏనుగులు, అడవి పందుల చేతిలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో జంతువుల చేతిలో ఏడాదిలో సగటున 30 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో నాలుగైదు జిల్లాల్లో ఈ దాడులు నమోదవుతున్నాయి. ఆహారం, నీరు వెతుక్కుంటూ అడవి జంతువులు సమీప గ్రామాల్లోని వారిపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించాలంటే అడవుల విస్తీర్ణం పెంచడంతో పాటు వేసవిలో జంతువుల కోసం మరిన్ని నీటి కుంటలు ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Animals