Atmakur : దాదాపు అనుకున్నట్టే జరిగింది. ఐతే.. అనుకున్నంత 'భారీ' ఇంపాక్ట్ వచ్చిందా రాలేదా అన్నదే డౌట్. ఆత్మకూరులో వైసీపీ గెలుపు బావుటా ఎగరేసింది. ఐతే.. ఈ గెలుపు టీడీపీ పోటీలో లేని సందర్భంలో వచ్చింది. మరోవైపు.. ఆంధ్ర ప్రదేశ్ లో వార్తల్లో మాత్రమే ఉంటూ.. అంతగా ప్రజాదరణ లేని బీజేపీకి ఓ మోస్తరు చెప్పుకోతగ్గ ఓట్లు పడటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 2022 జూన్ 23న జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ గెలుపే సాధించింది. లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని వైసీపీ చెప్పినప్పటికీ.. అధికార పార్టీకి లక్షకు పైగా ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఐతే.. బీజేపీ కూడా 19వేల ఓట్లు రాబట్టింది. దీంతో.. వైసీపీ మెజారిటీ 82వేలకు అటు ఇటుగా నిలిచిపోయింది. ఇది కూడా టీడీపీ పోటీలో లేని సందర్భంలో కావడంతో.. అసలు వైసీపీకి రావాల్సినంత అఖండ విజయం దక్కిందా అనే చర్చ జరుగుతోంది.
మొత్తం 20 రౌండ్లు ముగిసేవరకు పార్టీలకు పోలైన ఓట్లు గమనిస్తే
వైసీపీకి 1లక్ష 2వేల 74 ఓట్లు
బీజేపీకి 19,332 ఓట్లు
బీఎస్పీకి 4,897 ఓట్లు
నోటాకు 4,197 ఓట్లు పడ్డాయి.
217 బ్యాలెట్ ఓట్లలో 167 వైసీపీకి పోల్ అయితే.. 21 ఓట్లు బీజేపీకి, 7ఓట్లు బీఎస్పీకి, 10 ఓట్లు ఇతరులకు, నోటాకు 3 పడ్డాయి. మరో 9ఓట్లు చెల్లకుండా పోయాయి.
ఈ లెక్కలు చూస్తే.. బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. మొత్తం ఓట్లలో ఆరో వంతు ఓట్లు అంటే.. 16.67 శాతం ఓట్ల(దాదాపు 22వేల 8వందలు)ను రాబడితే బీజేపీకి డిపాజిట్ దక్కేది. ఐతే. బీజేపీకి 19వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. డిపాజిట్ దక్కించుకునేంత పోటీని తామిచ్చామనేది ఆ పార్టీ నేతల వాదన. ఇది బీజేపీకి ఏపీలో చెప్పుకోదగ్గ నంబర్లనే ఇచ్చిందనేది కొందరు నేతలు చెబుతున్న అభిప్రాయం. బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఇంకోలాగా ఉండేదనేది మరికొందరి విశ్లేషణ.
ఐతే.. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు ఎటు పడ్డాయనేది ఓ ఆసక్తికరమైన చర్చే. టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో.. చాలామంది పోలింగ్ లో పాల్గొనలేదు. ఎలాగూ మేకపాటి గౌతం రెడ్డి సానుభూతి ఓటుతో వైసీపీ గెలుస్తుందన్న భావనతో కూడా కొందరు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఓటు వేయాలనుకున్న టీడీపీ ఓటరు మాత్రం బీజేపీ, బీఎస్పీలతోపాటు.. నోటాకు కూడా గుద్దేసి వచ్చాడన్నమాట.
లక్ష ఓట్లు రావాలన్న లక్ష్యంతో వైసీపీ పనిచేసింది. విక్రమ్ రెడ్డి తరఫున వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు గడపగడపా తిరిగారు. మహానాడు, బాదుడేబాదుడు ప్రోగ్రామ్స్ తో టీడీపీ రివర్స్ ఎటాక్ చేస్తూ వచ్చింది. ఐతే.. చివరకు వైసీపీ మెజారిటీ 82 వేల ఓట్ల దగ్గరే ఆగిపోయింది. ఇది భారీ గెలుపే అయినప్పటికీ.. వైసీపీ ఊహించినంత అఖండవిజయం కాదన్నది టీడీపీ నేతల విమర్శ.
ఐతే.. పోలింగ్ శాతం తగ్గడం వల్లే మెజారిటీ నంబర్ కొంత తగ్గిందనీ.. వైసీపీకి మరో తిరుగులేని విజయం దక్కిందనీ అధికార పార్టీ నేతలు అప్పుడే రివర్స్ కౌంటర్లు మొదలుపెట్టేశారు. కులాల పరంగానూ.. 37వేల మంది రెడ్లు, 23 వేల మంది కమ్మ, 30వేల మంది ముస్లింలు, 17వేల మంది యాదవ్ లు, 40వేల మంది ఎస్సీలు తమకే మెజారిటీ ఇచ్చారని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు.
Published by:V. Parameshawara Chary
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.