విశాఖపట్టణం(Visakhapatnam)లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా రెండో క్రికెట్ మ్యాచ్ (IND vs AUS 2nd ODI)కు అంతా సిద్ధమైంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ కూడా చేరుకుంటున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండడంతో.. స్టేడియం వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది. టీమిండియా ఆటను కళ్లారా చూసేందుకు ఇప్పటికే వేలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఐతే వీరందరికీ మాత్రం ఇప్పుడు ఒకే ఒక్క టెన్షన్ పట్టుకుంది.అదే వర్షం..! ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. విశాఖలోనూ వానలు కురుస్తున్నాయి. శనివారం కూడా కుండపోత వర్షం కురిసింది. ఇవాళ కూడా వాన పడే సూచనలు ఉన్నాయని వాతావరశాఖ చెప్పడంతో.. మ్యాచ్ జరుగుతుందా? లేదంటే తక్కువ ఓటర్లకు కుదిరిస్తారా? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఉదయం 10 గంటల సమయంలో విశాఖ స్టేడియం పరిసరాల్లో ఆకాశం నిర్మలంగానే ఉంది. వర్షం కూడా పడడం లేదు. దట్టమైన మేఘాలు కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ వర్షం పడకపోవచ్చని.. ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ జరుగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే వాతావరణశాఖ మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతవరణంలో మార్పు రావచ్చని.. మళ్లీ మేఘావృతమై వర్షం కురవచ్చని అంచనా వేస్తోంది. ప్రైవేట్ వెదర్ ఫోర్‌కాస్ట్ సంస్థ విండీ కూడా... విశాఖలో వర్షం పడవచ్చని సూచిస్తోంది. మరి ఇవాళ రాత్రి వరకు వైజాగ్‌లో వాతావరణం ఎలా ఉంటుందో ఈ కింద విడ్జెట్‌లో లైవ్‌లో చూడండి.\
విశాఖలోని క్రికెట్ స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఓవర్లు కుదించయినా మ్యాచ్‌ను నిర్వహించవచ్చని అంచనా వేస్తున్నారు.
మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లోనూ గెలిస్తే.. సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఓడిపోతే మాత్రం... మూడో మ్యాచ్‌లోనే ఫలితం తేలుతుంది. ఒకవేళ వర్షం భారీగా పడి మ్యాచ్ రద్దయితే.. మూడో మ్యాచ్ రూపంలో మరో అవకాశం ఉంటుంది. అక్కడ ఇండియా గెలిస్తే సిరీస్ వస్తుంది. ఆస్ట్రేలియా గెలిస్తే.. సిరీస్ సమం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IND vs AUS, Local News, Visakhapatnam, Weather report