lighthouses: రా రమ్మని.. స్వాగతం పలుకుతున్న లైట్‌హౌస్‌లు.. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎప్పుడు వెళ్లాలి..?

లైట్ హౌస్ లు సందర్శించేందుకు కేంద్రం అనుమతి

లైట్ హౌస్ ను దగ్గర నుంచి చూడాలని చాలామంది కోరుకున్నా ఇప్పటి వరకు వారి కోరిక తీరి ఉండకపోవచ్చు.. అయితే ప్రభుత్వం అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 16 లైట్ హౌస్ లు సందర్శించేందుకు అనుమతి ఇఛ్చింది. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే..

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు, సందర్శలకు ఓ శుభవార్త చెప్పింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నలైట్‌ హౌస్‌లను సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోస్టల్‌ సర్వెలెన్స్‌ రాడార్‌ సిస్టమ్‌ కలిగిన ఈ లైట్‌ హౌస్‌లను చూసే అవకాశాన్ని సామాన్యులకు కూడా కల్పించింది. ప్రస్తుతం ఒక్క ఏపీలోనే 16 లైట్‌ హౌస్‌లను మనం దగ్గరకు వెళ్లి చూసే అవకాశం దక్కుతోంది. నేటి నుంచి 15వ తేదీ వరకు.. అంటే మూడు రోజుల పాటు వీటిని దగ్గర నుంచి మనం చూడొచ్చు. 15వ తేదీ వరకు విద్యార్థులకు అనుమతినివ్వగా, సామాన్య ప్రజలకు మాత్రం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతించారు. పదేళ్లలోపు చిన్నారులకు పూర్తిగా ప్రవేశం ఉచితంగా కల్పించనున్నారు. పదేళ్లు పైబడిన వారు 10 రూపాయలు టిక్కెట్ కోసం చెల్సించాల్సి వస్తుంది. భారీ నౌకల నుంచి చిన్న చిన్న బోట్ల వరకూ సముద్రంలో దారి చూపే దిక్సూచి లైట్‌హౌస్‌. ఎలక్ట్రానిక్‌ నావిగేషన్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా తీరప్రాంతంలో ఇప్పటికీ అవి సేవలందిస్తూనే ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా 185 లైట్‌హౌస్‌లు ఉన్నాయి. అయితే ఏపీ విషయానికి వస్తే 16 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత పురాతన లైట్‌హౌస్‌ విజయనగరం జిల్లా శాంతపల్లిలో ఉంది. ఇక్కడి లైట్‌హౌస్‌ను 1840లో నిర్మించారు. తర్వాత 1853లో ఆర్మగన్‌ షోల్‌ (మోనపాలెం), 1858లో మచిలీపట్నం, 1868లో పెంటకోట(తుని), 1860లో నిజాంపట్నం, 1874లో డాల్ఫిన్‌నోస్‌ లైట్‌హౌస్‌ (విశాఖ), 1877లో కళింగపట్నం, 1895లో శాంక్రిమెంటో(కరవాక.. తూర్పుగోదావరి), 1903లో భీమునిపట్నం, 1938లో కృష్ణపట్నం లైట్‌హౌస్‌లను నిర్మించారు. రాష్ట్రంలోని ఇక మిగిలిన లైట్‌హౌస్‌లన్నీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిర్మించినవే..

    ఒక్కోలైట్‌ హౌస్‌ ఒక్కో విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం డాల్ఫిన్‌నోస్, శాంక్రిమెంటో, అంతర్వేది, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం లైట్‌హౌస్‌లు కోస్టల్‌ సర్వెలెన్స్‌ రాడార్‌ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. డాల్ఫిన్‌నోస్‌ లైట్‌హౌస్‌ పూర్తిగా నావీ ఆధీనంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లైట్‌హౌస్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రం మెరైన్‌ ఎయిడ్‌ టూ నావిగేషన్‌–2021 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం లైట్‌హౌస్‌ల చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ విలువలను కాపాడుతూ పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్ పద్ధతిలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 13 లైట్‌హౌస్‌లుండగా, ఏపీలో డాల్ఫిన్‌నోస్‌ ఉంది. ప్రస్తుతం కోస్టల్‌ సర్వెలెన్స్‌తో పనిచేస్తున్న లైట్‌హౌస్‌లు 300 కి.మీ దూరంలో సముద్రంలోని కదలికలను కూడా ఇట్టే గుర్తిస్తాయి. ఒకప్పుడు సముద్రంలో తిరిగే నౌకలు, బోట్లకు దారిచూపిన ఈ లైట్‌హౌస్‌లను.. ఇప్పుడు సముద్ర జలాల్లోకి చొచ్చుకొచ్చే విదేశీ నౌకలు, ఇతర అక్రమ కార్యకలాపాలను కూడా గుర్తించేంతగా టెక్నికల్‌గా తీర్చిదిద్దారు.
    Published by:Nagesh Paina
    First published: