advertorial
Updated: November 24, 2019, 6:13 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- Advertorial
- Last Updated:
November 24, 2019, 6:13 PM IST
(రఘు, న్యూస్ 18 గుంటూరు ప్రతినిధి)
ఏపీలో సంపూర్ణ మద్యపానం నిషేధం దిశగా సీఎం జగన్ కీలక సంస్కరణలు తెచ్చారు. నూతన మద్యం పాలిసీలో మద్యం ధరలను భారీగా పెంచడమే కాకుండా వైన్ షాపులను పెద్ద మొత్తంలో తగ్గించారు. అంతేకాదు ఉన్న వైన్ షాపులను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహిస్తూ మద్యపానాన్ని క్రమంగా నియంత్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని చాలా ప్రాంతాల్లో మద్యం దొరకడం లేదు. ఒక వేళ ఉన్నా.. ఎక్కువ రేటుకు లభిస్తుండడంతో సరిహద్దులో ఉన్న తెలంగాణ గ్రామాల వైపు చూస్తున్నారు మందుబాబులు. తెలంగాణలోని వైన్ షాపుల నుంచి కొందరు కేటుగాళ్లు భారీ మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమ మార్గాల్లో ఏపీకి తరలిస్తున్నారు.
తెలంగాణతో పోల్చుకుంటే క్వార్టర్‌పై రూ.50-100 వరకు వ్యత్యాసం ఉంది. పెరిగిన ఈ రేట్లను తమకు అనుకూలంగా మలుచుకున్న కొందరు మద్యం వ్యాపారులు తెలంగాణ నుండి మద్యం అక్రమంగా దిగుమతి చేసుకొని భారీగా లాభాలను అర్జించటమే కాకుండా సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. సరిహద్దు బధ్రతా అధికారులకు ఈ విషయం తెలిసినా మామూళ్ళ మత్తుకి అలవాటు పడిన మద్యం అక్రమ రవాణాకి తమవంతు సహాయం అందిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అటు తరచూ తనిఖీలు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలసిన ఎక్సైజ్ అధికారులు కూడా తమ వాటా తాము తీసుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి.
గుంటూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పోలీస్ అధికారులు సాధారణ తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నించారు. ఈ క్రమంలో లారీ కిందపడి చనిపోయారు. ప్రమాదం తర్వాత అధికారులు తనిఖీ చేస్తే.. వారి వద్ద మద్యం బాటిళ్లు లభించాయి. వీరు తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మద్యాన్ని సమీప గ్రామాల్లోని బెల్ట్ షాపులకు విక్రయించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే గత 10 రోజుల్లో ఇరవై మందిని అదుపులోకి తీసుకుని సుమారు 10 లక్షల రూపాయల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారంటే.. ఏ రేంజ్లో మద్యం అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు సీఎం జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం ఆశయాలకు తూట్లు పొడుస్తున్న అక్రమ మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మామూళ్లు తీసుకుంటూ వారికి సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 24, 2019, 6:11 PM IST