నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచీ జనసేన తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు... తన మనసులో మాటను బయటపెట్టారు. ఎంపీగా గెలిస్తే... సినిమాల్లో నటించడం సాధ్యం కాదని అన్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికలు రాగానే... జబర్దస్త్ నుంచీ తప్పుకున్నారు. ఎంపీ అయితే పూర్తిగా ప్రజా సేవకే అంకితం కావాలనే ఉద్దేశంతో... సినిమాల్లో చెయ్యడం కుదరదంటున్నారు. ఇదే విషయంపై ఎన్నికలు జరిగిన రోజున (ఏప్రిల్ 11) పోలింగ్ బూత్ దగ్గర ఓ పెద్దావిడ అడిగిన ప్రశ్నకు తాను ఏం చెప్పిందీ తాజాగా మనతో పంచుకున్నారు నాగబాబు. రాజకీయాల్లోకి వెళ్లినా జబర్దస్త్ కార్యక్రమం మాత్రం నాగబాబు మానకూడదని ఆ పెద్దావిడ కోరిందని ఆయన తెలిపారు.
జబర్దస్త్ కార్యక్రమం నాగబాబుకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. హాట్ సీటులో రోజాతోపాటూ ఆయన కూడా ఉంటేనే ఎక్కువ మంది ఆ కార్యక్రమం చూసేందుకు ఇష్టపడతామని ఇదివరకు చాలాసార్లు తెలిపారు. తాజాగా ఆ పెద్దావిడ కూడా నాగబాబు ఎట్టిపరిస్థితుల్లో జబర్దస్త్ మానేయకూడదని కోరుకుందట. అది ఒక పెయిడ్ సర్వీస్ అంటున్న నాగబాబు... దాని వల్ల తనకు కొంత ఆదాయం వస్తోందనీ, ఆ కార్యక్రమానికి వారానికి నాలుగైదు రోజులే కష్టపడతాననీ తెలిపారు. ఎంపీగా గెలిస్తే కూడా... జబర్దస్త్ కార్యక్రమం చేస్తూ, ప్రజాసేవ చెయ్యగలనని అంటున్నారు.
జబర్దస్త్ చెయ్యడానికి సిద్ధమే అంటున్న నాగబాబు... సినిమాలు మాత్రం చెయ్యలేనని అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సైతం... అజ్ఞాతవాసి సినిమాతో తన టాలీవుడ్ కెరీర్ను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఓ 20 ఏళ్లపాటూ రాజకీయాల్లో ఉండేందుకే జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఇప్పుడు అదే పార్టీలో చేరి, ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన నాగబాబు సైతం... గెలిస్తే, ఇక సినిమాలు చేయలేకపోవచ్చని అంటున్నారు. తమ్ముడి బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.