హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: CMOలో శ్రీలక్ష్మి కి కీలక బాధ్యతలు...సీఎం జగన్ నిర్ణయం?

Andhra Pradesh: CMOలో శ్రీలక్ష్మి కి కీలక బాధ్యతలు...సీఎం జగన్ నిర్ణయం?

ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు

ఐఏఎస్ శ్రీలక్ష్మికి కీలక బాధ్యతలు

ఏపీ కేడర్ కు వచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మికి సీఎంఓలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  కేంద్రం ఒప్పుకోకపోయినా పట్టుబట్టి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులకు వచ్చిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై.శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వనున్నారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీ సచివాలయంలో అయితే ఇదే హాట్ టిక్ గా మారింది. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ నుంచి ఆదేశాలు రావడంతో ఆమె శనివారం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇంకా శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఖరారు కాలేదు. తాజాగా ఆమెకు తన కార్యాలయంలోనే పోస్టింగ్ ఇవ్వాలని సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శ్రీలక్ష్మీకి కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

  అదే కారణమా..?

  శ్రీలక్ష్మిపై సీబీఐ కేసులు, శాఖాపరమైన నిర్ణయాలపై తీవ్ర ఆరోపణలుండటంతో పాటు కొన్నాళ్లు జైలుకు కూడా ఉండాల్సి వచ్చింది. అందువల్ల ఇతర శాఖల్లో నియమిస్తే ఆమె ఒకింత ఇబ్బందికి గురయ్యే అవకాశముంది. ఏదైనా శాఖకు అధిపతిగా నియమిస్తే అక్కడి అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా సిబ్బంది ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితి. తనను ఎక్కడ నియమించినా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశాలుండటంతో సీఎంఓలోనే ఉంటే ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని భావించినట్లు తెలిసింది. ఇందుకు సీఎం కూడా సముఖంగా ఉన్నట్లు సమాచారం.

  విమర్శలు ఎదుర్కోక తప్పదా..?

  ఐతే ఇక్కడ చిన్న ఇబ్బంది కూడా ఉంది. సీఎం జగన్ పై నమోదైన సీబీఐ కేసుల్లో.. శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. దీంతో కేసుల్లో ఉన్నవారినే తన కార్యాలయంలో నియమించుకున్నారనే విమర్శలను ముఖ్యమంత్రి ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. పోస్టింగ్ విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాగానే నిర్ణయం తీసుకోనున్నారు.

  కాగా విభజన సమయంలో శ్రీలక్ష్మిని కేంద్రం తెలంగాణకు కేటాయించింది. అదే సమయంలో డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చేందుకు యత్నించగా కేంద్రం అంగీకరించలేదు. పైగా ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం శ్రీలక్ష్మి ప్రయత్నాలు ఫలించలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ సీరియస్ గా ప్రయత్నించారు. ఐతే సెక్రటరీ స్థాయి అధికారుల డిప్యుటేషన్ కు కేంద్రం ఒప్పుకోలేదు. దీంతో స్వతహాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తనను పోస్టల్ అడ్రస్ కారణంగా కేంద్రం తెలంగాణకు కేటాయించిందని కేంద్ర పరిపాలనా ట్రైబ్యుల్ ఎదుట వాదించారు. శ్రీలక్ష్మి వాదనను పరిగణలోకి తీసుకున్న CAT.. ఏపీ కేడర్ కు వెళ్లేందుకు అంగీకరించింది. దీంతో ఆమె సొంత రాష్ట్రానికి తిరిగొచ్చారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు