జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంపై ఎవరూ ఊహించని కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లో విఫలమయ్యానని అన్నారు. ఐతే ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. హైదరాబాద్ లో సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ''ఫేసింగ్ ది ఫ్యూచర్'' అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన ఆయన..తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను విఫల రాజకీయ నాయకుడినని అనగానే.. అక్కడున్న విద్యార్థులు.. 'కాదు..కాదు'.. అని కేకలు వేశారు. ''సీఎం ..సీఎం..'' అని నినాదాలు చేశారు.
''వైఫ్యలం ఎలాగైతే తాత్కాలికమైనదో.. విజయం కూడా తాత్కాలికమైనదే. విజయాన్ని నెత్తికెక్కించుకోకూడదు. రాజకీయాల విషయానికొస్తే.. ఇప్పటి వరకైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ని. దానిని అంగీకరించాలి. దీని గురించి నేను బాధపడను. ఎందుకంటే వైఫల్యం అనేది విజయానికి సగం బాట వేస్తుంది. వైఫల్యాలను కూడా నేను సానుకూల దృక్పథంతోనే చూస్తా. వైఫల్యాల గురించి ఎప్పుడూ బాధపడను. సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలా మంది ఏమీ చేయడం లేదు. కానీ నేను అలా కాదు. నా ప్రయత్నంతో ఎంతో కొంత సాధించానని నమ్ముతా.'' అని పవన్ కల్యాణ్ అన్నారు.
అక్కినేని, ఎన్నారై ఆసుపత్రుల్లో ముగిసిన ఈడీ రైడ్స్..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
కాగా, 2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్..ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మాత్రం మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి... ప్రభుత్వన్ని ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి గుడ్‌బై చెప్పారు. వామపక్ష పార్టీలతో జతకట్టి.. ఎన్నికల్లో పోటీ చేశారు. ఐతే జనసేన పార్టీ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లోనూ ఓడిపోయారు. ఎన్ని ఓటములు ఎదురైనా.. ప్రజల కోసం సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటానని పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా ఇచ్చే పార్టీగా జనసేన ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బీజేపీ పార్టీతో పవన్ కల్యాణ్ దోస్తీ కొనసాగిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల వరకు అది కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan