ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న, మొన్న 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు నాకు ఫోన్ చేశారు. మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. కాకపోతే మీరు బయటపడ్డారు మేము బయటపడలేదని అన్నారు. దేనికైనా నేను సిద్ధం. టీడీపీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నా. చంద్రబాబు ఇష్టం ప్రకారం పోటీ చేస్తా అని కోటంరెడ్డి (Kotamreddy Sridhar reddy) చెప్పుకొచ్చారు.
కోటంరెడ్డి సంచలన ప్రకటన..
3 నెలలుగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. నాకు 9849966000 నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. ఆడియో కూడా నాకు పంపారు. నేను నా ఫ్రెండ్ మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చింది. ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా. ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేతో ఆగదు. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తారని అన్నారు. వైఎస్సార్ కు నేను వీర విధేయుడిని. అవమానాలు ఎదుర్కొనైనా పార్టీ కోసం కష్టపడ్డాను. నన్ను అవమానించిన చోట నేను ఉండదలచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో YCPనుంచి పోటీ చేయనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar reddy) ప్రకటించారు. నిన్న బాలినేని చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడినవి కాకుండా సీఎం జగన్ మాట్లాడినవిగా భావిస్తాను. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా. నాయకునికి ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోతే ఎలా. ఇక ప్రజల్ని ఎలా నమ్ముతారన్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తితో అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా కోటంరెడ్డి (Kotamreddy Sridhar reddy) వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కు, కాల్ రికార్డింగ్ కు తేడా ఉంటుంది. ఆ ఆడియో క్లిప్ కోటంరెడ్డి స్నేహితుడే ఇంటెలిజెన్స్ చీఫ్ కు పంపి ఉండొచ్చు. రికార్డింగ్ చేసిన ఆ ఆడియో క్లిప్ ను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ చీఫ్ పంపి ఉండొచ్చని అమర్నాథ్ అన్నారు. అమర్నాథ్ వ్యాఖ్యలపై కోటంరెడ్డి (Kotamreddy Sridhar reddy) వెంటనే స్పందించారు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. కానీ ఆధారాలుండాలి. ఇది ట్యాపింగ్ కాదు. కాల్ రికార్డింగ్ అంటున్నారు. అయితే ఈ విషయాన్ని మంత్రి అమర్నాథ్ నిరూపించాలి. నాది ఐఫోన్ . మా స్నేహితునిది ఐఫోన్ అని అందులో కాల్ రికార్డింగ్ చేయలేరని కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంటెలిజెన్స్ చీఫ్ స్వయంగా నాకు చెప్పారని కోటంరెడ్డి (Kotamreddy Sridhar reddy) అన్నారు.
కాగా ఇవాళ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో అలజడి రేపుతోంది. ఒక్కరు ఇద్దరు పోయి 35 మంది ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చగా మారాయి. ఇంతకీ ఆ 35 మంది ఎమ్మెల్యేలు ఎవరు? కోటంరెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Kotamreddy sridhar reddy