విశాఖలో మళ్లీ కలకలం.. HPCL నుంచి దట్టమైన పొగలు

విశాఖలో అలుముకున్న దట్టమైన పొగలు

ఘటనపై HPCL ప్రతినిధులు స్పందించారు. క్రూడాయిల్ శుద్ధిచేసే విభాగంలో వ్యర్థాలు పేరుకున్నాయని.. వాటిని తొలగిస్తున్న క్రమంలో పొగలు వెలువడ్డాయని చెప్పారు.

  • Share this:
    ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవక ముందే విశాఖలో మరోసారి కలకలం రేగింది. మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. తెల్లటి పొగలు చుట్టు పక్కల ప్రాంతాల్లో అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై HPCL ప్రతినిధులు స్పందించారు. క్రూడాయిల్ శుద్ధిచేసే యూనిట్‌లో వ్యర్థాలు పేరుకున్నాయని.. వాటిని తొలగిస్తున్న క్రమంలో పొగలు వెలువడ్డాయని చెప్పారు. ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో వెంటనే అప్రమత్తమై తగ్గించామని తెలిపారు. ఈ పొగల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదముండదని స్పష్టం చేశారు. రెండు మూడు గంటల తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

    కాగా, మే 7న విశాఖపట్టణంలో మహా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరీన్ గ్యాస్ లీకై 12 మంది చనిపోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. విషవాయువును పీల్చడంతో స్థానికులు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషవాయువు ధాటికి పశుపక్షాదులు సైతం చనిపోయాయి. చుట్టుపక్కల ఉన్న పలు చెట్లు మాడిపోయాయి. గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందజేసింది. అటు వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స అవసరం ఉన్న వారికి రూ. 25 వేలు ఇచ్చారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం చేయడంతో.. పశువులు పోగొట్టుకున్న వారికి రూ.20వేల సాయం అందజేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: