ఇల వైకుంఠం తిరుమలలో రథ సప్తమి వేడుకలు శనివారం వైభవోపేతంగా జరిగాయి. రథ సప్తమి సందర్భంగా సప్త వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఒక రోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తకోటి గోవింద నామ స్మరణలతో తిరుమల గిరులు మార్మోగాయి. రోజంతా నాలుగు మాడవీధులు భక్తకోటితో కిటకిటలాడిపోయాయి. ఒక రోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు అంచనావేస్తున్నారు. సూర్యోదయాన ఉదయం 5.30 గంలకు సూర్యప్రభ వాహనసేవతో మొదలైన రథ సప్తమి వేడుకలు...రాత్రి 8 గం.లకు చంద్రప్రభ వాహనసేవతో ముగిశాయి. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు.

తిరుమలలో రథ సప్తమి వేడుకలు
కొనసాగుతున్న భక్తుల రద్దీ
రథ సప్తమి వేడుకల కోసం వచ్చిన భక్తులు..వాహనసేవలు ముగిశాక స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో ఇవాళ ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయంపడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైమ్ స్లాట్ సర్వదర్శనం, కాలినడక దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది. రథ సప్తమి వేళ శనివారం స్వామివారిని 96,326 మంది భక్తులు దర్శించుకుని...హుండీలో రూ.2.45 కోట్ల నగదు కానుకలు సమర్పించుకున్నారు. రథ సప్తమి, వారాంతపు సెలవు దినాల నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశముందని భావిస్తున్నారు.