‘అమర్ రహే లాన్స్ నాయక్ సాయితేజ’.. ‘అమరవీరుడా.. వందనం’.. ‘భారత్ మాతాకీ జై’.. ‘అమర్ రహే జవాన్ సాయితేజ’.. నినాదాలు చిత్తూరు జిల్లాలో దద్దరిల్లాయి. జవాన్ సాయితేజ అంతిమయాత్ర మార్గంలో రోడ్లకు ఇరువైపులా జనం నిలబడి.. అశృవులతో వందనాలు చేశారు.. త్రివరణ పతాకాలు చేతపట్టుకున్న యువకులు భారీ బైక్ ర్యాలీలు తీశారు.. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ సాయితేజ అంతిమయాత్రలో చోటుచేసుకున్న దృశ్యాలివి..
తమిళనాడులో ఐఏఎఫ్ హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో సర్వసైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్, ఆయన సతీమణి, రావత్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అయిన జవాన్ సాయితేజతోపాటు మొత్తం 13మంది దుర్మరణం చెందడం తెలిసిందే. జవాన్ సాయితేజ భౌతికకాయం ఆదివారం ఉదయం బెంగళూరు ఎయిర్ బేస్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఆంధ్రా-కర్నాటక సరిహద్దు నుంచి సాయితేజ పార్ధివదేహానికి నివాళి అర్పిస్తూ యువత బైక్ ర్యాలీ చేపట్టింది.
మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు జవాన్ సాయితేజ అంతిమయాత్ర కొనసాగింది. అడుగడుగునా ప్రజలు ఇళ్ల నుంచి బయటికొచ్చి జవాన్ భౌతిక కాయానికి సెల్యూట్ చేశారు. ‘జై జవాన్ అమర్ రహే సాయితేజ’అంటూ నినాదాలు చేశారు. స్వగ్రామం రేగడవారిపల్లెలో సాయితేజకు సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలుకుతున్నారు.
Sweden girl: ముంబై స్లమ్ డాగ్ ప్రియుడి కోసం స్విడన్ బాలిక ఏం చేసిందో తెలిస్తే అవాక్కవుతారు..
జవాన్ సాయితేజ చివరి చూపుకోసం బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర జవానుకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నాయి. ఇంటి వద్ద సాయితేజ చిన్నారి కొడుకు.. ఐ లవ్ యూ డాడీ.. అంటూ ఫ్లెక్సీలో ఫొటోను ముద్దు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. సాయితేజ ఇంటి గ్రామంసహా చుట్టుపక్కలంతా విషాదకర వాతావరణం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chitoor, Indian Army, Sai teja