ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలను (AP New Districts) ప్రకటించిన సంగతి తెలిసందే. 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాలు, భౌగోళిక స్వరూపం ప్రాతిపదికన 26 జిల్లాలుగా విభజించింది. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పరిపాలన జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఐతే కొత్త జిల్లాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మొత్తం 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో జిల్లా పరిధులు, పేర్లు, జిల్లా కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల వంటి డిమాండ్లు ఉన్నాయి. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎక్కువ డిమాండ్లు వచ్చాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ కొత్త విజ్ఞప్తులు తెరపైకి వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాలో పలాసను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ వచ్చింది. విజయనగరం జిల్లాలో మన్యం జిల్లాను పేరు మార్చి పార్వతీపురంగా మార్చాలని, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మెంటాడను విజయనగరంలో కలపాలని, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్, ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖజిల్లాలోనే ఉంచాలని అక్కడి ప్రజలు కోరారు. విశాఖపట్నం విషయానికి వస్తే.. పెందుర్తిని అనకాపల్లిలో కాకుండా వైజాగ్ లోనే ఉంచాలని.. కొత్త జిల్లా కేంద్రంగా అనకాపల్లి కాకుండా నర్సీపట్నం ఉండాలని, స్టీల్ ప్లాంట్, దానికి సంబంధించిన టౌన్ షిప్ ను విశాఖ జిల్లాలోకే తీసుకురావాలన్న డిమాండ్లు వచ్చాయి.
తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే.. రంపచోడవరాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా కాకుండా.. కొత్త జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ వచ్చింది. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలాన్ని కాకినాడ జల్లాలో ఉంచాలని, మండపేట, గోకవరం మండలాలను రాజమహేంద్రవరం జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా భీమవరం కాకుండా నరసాపురం ఉండాలని స్థానికులు కోరుతుండగా, ద్వారకా తిరుమలను ఏలూరులో ఉంచాలని, గణపవరం మండలాన్ని భీమవరంలో ఉండాలని కోరుతున్నారు. పోలవరం మండలాన్ని రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేసి అందులో కలపాలన్న విజ్ఞప్తులు వచ్చాయి.
ఇక కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలో కాకుండా విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే విజయవాడ జిల్లాలో ఉంచాలని కోరుతున్నారు. ఇక నూజివీడును ఏలూరులో కాకుండా విజయవాడలో ఉంచాలని, ఉయ్యూరు, అవనిగడ్డ, మైలవరంలో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నరసరావుపేట బదులు గురాజాల కేంద్రంగా కొత్త జిల్లా, రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్, చుండూలు, వేమూరు మండలాలను గుంటూరు జిల్లాలోనే కొనసాగించడం, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల వస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు గిద్దలూరు నియోజకవర్గాన్ని నంద్యాలలో కలపాలని స్థానికులు కోరుతున్నారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు. అలాగే తమను కూడా ఒంగోలులోనే ఉంచాలని అద్దంకి నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని.. ఇందులో ప్రకాశం జిల్లా కనిగిరి, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గాలుండాలనేది డిమాండ్.
అనంతపురం జిల్లా విభజన విషయానికి వస్తే.. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన సత్యసాయి జిల్లాను అదే పేరుతో హిందూపురం కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. అలాగే ధర్మవరం డివిజన్ ను కొనసాగించడంతో పాటు రామగిరి మండలాన్ని అనంతపురంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలో రాయచోటిని జిల్లా కేంద్రంగా కాకుండా రాజంపేటను ప్రకటించాలని, రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు, రైల్వే కోడూరును శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని, సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కలపాలనేది డిమాండ్.
చిత్తూరు జిల్లాలో మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని, నగరి నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కాకుండా శ్రీబాలాజీ జిల్లాలో కొనసాగించాలని, వెదురుకుప్పం మండలాల్ని తిరుపతిలో ఉంచాలని, కుప్పం, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లుగా ప్రకటించాలని అక్కడివారు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, కౌతాళం, కోసిగి మండలాలను ఆదోని జిల్లాలో ఉంచాలనేది డిమాండ్. ఇక పాణ్యం పాణ్యం, గడివేములను నంద్యూల జిల్లాలో ఉండాలని స్థానికులు డిమాండ్ చేసత్న్నారు. అలాగే డోన్, నందికొట్కూర్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలనేది విజ్ఞప్తి.
మరో పది రోజుల్లో కొత్త జిల్లాల నుంచే పాలన జరగాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో.. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లా కేంద్రాలకు కొన్ని ప్రాంతాలు దూరంగా ఉండటంతో భౌగోళిక స్వరూపాన్ని బట్టి మార్పులుంటాయా లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts