పవన్ కల్యాణ్ కొంపముంచుతాడా... టీడీపీ, వైసీపీకి షాక్ తప్పదా... విశ్లేషకులు ఏమంటున్నారంటే...

AP Assembly Elections 2019 : ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందన్నదే ప్రశ్న.

Krishna Kumar N | news18-telugu
Updated: March 31, 2019, 7:48 AM IST
పవన్ కల్యాణ్ కొంపముంచుతాడా... టీడీపీ, వైసీపీకి షాక్ తప్పదా... విశ్లేషకులు ఏమంటున్నారంటే...
పవన్ కల్యాణ్
  • Share this:
పథకాలతో ప్రయోజనం పొందినవాళ్లంతా తమకే ఓటు వేస్తారని నమ్ముతోంది టీడీపీ. తండ్రి వైఎస్సార్ హయాంలో ప్రయోజనం పొందిన వాళ్లంతా తమతోనే ఉన్నారని భావిస్తోంది వైసీపీ. ఈ రెండు పార్టీలూ అధికారంపై గంపెడాశలతో ఉన్నాయి. ఐతే... వీటి మధ్యలో అనూహ్యంగా పుట్టుకొచ్చిన పార్టీ జనసేన. ఈ పార్టీకి కొన్ని మైనస్‌లు ఉన్నట్లే, ప్లస్సులూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం సమర్థంగా జరగకపోవడం అతి పెద్ద మైనస్ అయితే... పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ ఉండటం అతి పెద్ద ప్లస్ పాయింట్. మరి ప్లస్ పాయింట్లతో మైనస్‌లను పవన్ జయించగలరా? ఏపీకి సీఎం అవుతానంటున్న ఆయన ఆశలు ఫలించే అవకాశాలున్నాయా? అసలు జనసేన ప్రభావం ఎలా ఉంటుంది? టీడీపీ, వైసీపీకి ఆ పార్టీతో కలిగే నష్టమేంటి?

పార్టీలు ఎంత పెద్ద యుద్ధం చేసినా... ఉన్నది 175 సీట్లే. ఎంతలా పంచుకున్నా... వాటినే పంచుకోవాలి. మేజిక్ మార్క్ 88. ఈ ప్రకారం చూస్తే... 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 104, వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలూ కలిపి 171 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఐదేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. అంచనాలకు తగినట్లుగా టీడీపీ పరిపాలించలేదన్నది ఒక కోణమైతే... పాదయాత్రలతో వైసీపీ బలపడిందన్నది మరో కోణం. ఆ ప్రకారం చూస్తే... ఈసారి టీడీపీ సీట్లు తగ్గుతాయనీ, వైసీపీకి సీట్లు పెరుగుతాయని అనుకోవచ్చు. ఇక్కడే ఈక్వేషన్స్ మార్చేస్తోంది జనసేన. టీడీపీకి తగ్గే ఓట్లు... వైసీపీకి బదులు జనసేనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యువత జనసేనవైపు మొగ్గుచూపుతున్న సంకేతాలొస్తున్నాయి.


ఎప్పుడైనా సరే... విపక్షాలు ఎక్కువయ్యే కొద్దీ... అధికార పక్షం సంతోషంగా ఉంటుంది. కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను విపక్షాలు చీల్చుకుంటాయి. అందువల్ల విపక్షాల్లో ఏ పార్టీ కూడా అధికారం చేపట్టే అవకాశాలు దూరమవుతాయి. 2014లో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా వైసీపీకే దక్కిన పరిస్థితి ఉండగా... ఇప్పుడు జనసేన కూడా బరిలో నిలవడం... వైసీపీకి తలనొప్పే అని చెప్పుకోవచ్చు.

2009లో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేశాయి. ఫలితంగా ప్రతిపక్ష టీడీపీ దెబ్బతినగా... వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని కాంగ్రెస్ రెండోసారి అధికారం చేపట్టింది. ప్రస్తుతం జనసేన ఒంటరిగా కాకుండా... లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో కలిసి బరిలో నిలిచింది. టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని చాలా మంది జనసేనలో చేరారు.1996 లోక్ సభ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి అభ్యర్థులు టీడీపీ ఓట్లను చీల్చారు. ఫలితంగా కాంగ్రెస్ లాభపడింది. 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను చీల్చడంతో టీడీపీ నష్టపోయి కాంగ్రెస్ ప్రయోజనం పొందింది.

పవన్ కల్యాణ్ తన ప్రచారంలో టీడీపీ కంటే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇది వైసీపీకి ఏమాత్రం అనుకూలించని అంశం. జనసేన, టీడీపీ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందనీ, అందువల్లే పవన్ తమను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ, వైసీపీ రెండు పార్టీల అధినేతలూ... రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో... సీమలో ఆ రెండు పార్టీల ప్రభావం ఎక్కువ. అందువల్ల కోస్తా ప్రాంతానికి చెందిన పవన్ కల్యాణ్... ఉత్తరాంధ్రతోపాటూ... గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఉత్తరాంధ్రలో విస్త్రృత ప్రచారాలకు తోడు... కాపు వర్గం నేతల్ని తమవైపు తిప్పుకోవడం ద్వారా పవన్ కల్యాణ్... ఆ వర్గం ఓట్లను రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం వైసీపీతోపాటూ, టీడీపీకీ షాకిచ్చేదే.
వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటే... ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలూ కలిసే అవకాశాలుంటాయి. అది వైసీపీకి ప్రమాదకర సంకేతం. జనసేన ఎంత బలపడితే, టీడీపీకి అంత నష్టం. ఐతే... టీడీపీ కంటే వైసీపీకి ఇంకా ఎక్కువ నష్టం. పవన్ కల్యాణ్ ప్రభావం ఏమంత ఉండదనీ, అసలా పార్టీపై ప్రజల్లో ఏ మాత్రం అవగాహన లేదని చెబుతున్నారు కొందరు. అందులోనూ కొంత వాస్తవం ఉంది. దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో ముద్ర వేయించుకున్న టీడీపీ, 15 ఏళ్లుగా (వైఎస్సార్ పాలనతో కలిపి) ప్రజలతో మమేకమవుతున్న వైసీపీతో పోల్చితే... జనసేన ఇంకా ఓనమాలు దగ్గరే ఉందని అనుకోవచ్చు.

ఏపీలో యూత్ చాలా చురుగ్గా ఉన్నారు. వారిలా చాలా మంది పవన్ కల్యాణ్ అంటే పడిచస్తారు. అలాంటి వాళ్ల ఓట్లు కచ్చితంగా జనసేనకే వెళ్తాయి. వాటిని దాటి... టీడీపీ, వైసీపీ సంప్రదాయ ఓటు బ్యాంకును జనసేన ఎంత రాబట్టుకుంటే... ఆ రెండు పార్టీలకూ అంతలా నష్టం కలుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.

 

ఇవి కూడా చదవండి :

నేడు ఏపీకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్... నేతల పర్యటనలు... ఎవరు ఎక్కడంటే...

నేడు విజయవాడ, అనంతపురంలో రాహుల్ పర్యటనలు... టార్గెట్ నరేంద్ర మోదీ

Pics : రేపు ఇస్రో రాకెట్ ప్రయోగం... నింగిలోకి 29 శాటిలైట్లు... దేశ రక్షణకు మేలు

First published: March 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>