AmaraReddy Colony: సీఎం జగన్ ఇంటి వెనుక అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు.. ‘సీఎం సార్.. కాపాడండి’ అంటూ ఆర్తనాదాలు..

సీఎం జగన్, రోదిస్తున్న బాధిత మహిళ

‘న్యాయం ఎక్కడ.. అర్ధరాత్రి ఇళ్లు కూల్చుతున్నారు.. ఎక్కడ ఉండాలి.. ఎక్కడికి వెళ్లాలి.. కలెక్టర్ మాట నీటి మూటయింది’ తాడేపల్లిలోని అమరారెడ్డి నగర్‌లో అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని ఇలా నిలదీశారు. ‘సీఎం సార్ కాపాడండి’ అంటూ ఆర్తనాదాలతో బాధితులు రోదించారు.

 • Share this:
  తాడేపల్లి: ‘న్యాయం ఎక్కడ.. అర్ధరాత్రి ఇళ్లు కూల్చుతున్నారు.. ఎక్కడ ఉండాలి.. ఎక్కడికి వెళ్లాలి.. కలెక్టర్ మాట నీటి మూటయింది’ తాడేపల్లిలోని అమరారెడ్డి నగర్‌లో అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని ఇలా నిలదీశారు. ‘సీఎం సార్ కాపాడండి’ అంటూ ఆర్తనాదాలతో బాధితులు రోదించారు. సీఎం నివాసం వెనుక ఉన్న అమరారెడ్డి నగర్‌లో ఉద్రికత్త చోటుచేసుకుంది. అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అమరారెడ్డి నగర్‌లో ఇళ్లను అధికారులు దగ్గరుండి కూల్చి వేయించారు. ‘కాపాడాల్సిన వ్యక్తే కూల్చమని అదేశిస్తుంటే మాకు దిక్కు ఎవరు’ అంటూ నిర్వాసితుల ఆక్రోశం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని.. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కదిలి రావాలని అమరారెడ్డి నిర్వాసితులు వేడుకుంటున్నారు. కాళ్లు పట్టుకుని బతిమాలినా అధికారులు కనికరం చూపలేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంగళగిరి టిడ్కో భవనాలలో తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ అఖిలపక్ష నేతలకు తెలిపారు. కానీ అధికారులు ఇంతలోనే పోలీస్ బలగాలతో నిర్వాసితుల ఇళ్లు కూల్చివేతకు పూనుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడువు ఇస్తామని చెప్పి ఉన్నతాధికారులు మాట తప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎవరి మెప్పు కోసం అధికారుల ప్రయత్నాలని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నమ్మించి మోసం చేశాడని, మహిళలు అని కూడా చూడకుండా స్థానిక వైసీపీ నాయకులు తమపై అసభ్యకరంగా మాట్లాడుతూ, దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. కొంతమంది వైసీపీ నాయకులు తమ పేర్లతో దొంగ పత్రాలు సృష్టించి నివాస స్థలాలు పొందారని, ఎదురు ప్రశ్నిస్తే నోరు నొక్కేందుకు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపిస్తున్నారు.

  వైసీపీ కార్యకర్తలకు స్థలాలు దోచిపెట్టేందుకే తమకు అన్యాయం చేస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరారెడ్డి నగర్ వాసులకు సీఎం భద్రత దృష్ట్యా ప్రత్యామ్నయ నివాస ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చెప్పారు. ఈ కాలనీలో నివాసం ఉంటున్న 317 కుటుంబాలను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి ఉందని.. అందువల్లే నిర్వాసితులందరికీ ‘పేదలందరికీ ఇంటి పథకం’ కింద ఆత్మకూరు వద్ద స్థలాలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే.. కొంతమంది లబ్ధిదారుల కోరిక మేరకు మంగళగిరి టిడ్కో గృహాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పడం గమనార్హం.

  ఇదిలా ఉండగా.. అమరారెడ్డి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని న్యాయం కోసం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసిన మాజీ వలంటీరు శివశ్రీతో పాటు మరో ఇద్దరిని తాడేపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. అక్రమంగా అరెస్ట్ చేసిన శివశ్రీతో పాటు కొసరాజు శైలజ, సుబ్బలక్ష్మిని తక్షణమే విడుదల చేయాలని అఖిలపక్ష నేతలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. స్థలాలు పొందిన నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: