తిరుమల కొండను వేదములే శిలలైన తిరుమల కొండా అంటూ పదకవితా పితామహుడు అన్నయ్య కీర్తించారు. స్వామి వారి వైభవం తిరుమల కొండని చూస్తేనే ప్రతిబింబిస్తుంది. కొండంతా శ్రీవారి ఆకృతులే...?? ఎవరో చెక్కారు అన్నట్టుగా కాదు... సహజ సిద్ధంగా ఏర్పడినవే.!! తిరుమల కొండను దూరం నుండి చూస్తే శ్రీనివాసుని స్వరూపం కళ్ళారా మనం చూడొచ్చు. ఇక తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శివలింగ రూపం మనకి దర్శనం ఇస్తుంది. ఇలా ఒక్కో అడుగు ఒక్కో దేవతామూర్తుల సహజ సిద్దమైన రూపాలుగా ఏర్పడ్డాయి. తిరుమల కొండ ప్రత్యేకతను చాటి చెప్పడానికే నిదర్శనంగా నిలుస్తోంది తిరుమలలోని శిలాతోరణం.
ఓ వైపు శంఖు,మరో వైపు చక్రాలు.. మహా విష్ణువు కృపతోనే ఈ సహజ శిలా తోరణం ఏర్పడినట్లు పురాణాలు వర్ణిస్తున్నాయి. ప్రపంచంలోనే అరుదైన, సహజ సిద్దంగా ఏర్పడిన శిలా తోరణంగా కూడా దీనిని పిలుస్తారు. మరికొందరైతే ఈ మార్గాన్ని వైకుంఠానికి వెళ్ళే ద్వారంగా కూడా పిలుస్తుంటారు.
శ్రీనివాసుడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు దాగి ఉన్నాయి. మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయనేందుకు కూడా ఎన్నో సాక్ష్యాలున్నాయి. శ్రీవారి ఆలయం నుండి ఒక్క కిలో మీటర్ దూరం ఉన్న శిలాతోరణంను సందర్శిస్తే కళ్లు చెదరకమానవు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత నిర్మాణం శిలాతోరణం.
దైవత్వ ఉట్టిపడే ఈ శిలాతోరణం సుమారు 25 అడుగుల పొడవును, 10 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఎదురు నిలబడి ఈ శిలాతోరణం నేటికి చెక్కు చెదరకుండా నిలబడి భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శిథిలత్వం, జలప్రవాహాల ఒరిపిడి చర్యల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడినట్లు నిపుణులు అంటున్నారు. మన దేశంలోనే అసహజతత్వాల్లో ఒకటైన ఎపార్చియన్ భౌగోళికతల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.
రాళ్ళు ఒకదానిపై ఒక్కటి పెన వేసుకుని శిలల వలే సజీవ కళతో యాత్రికులను ఆకర్షిస్తుంది. భౌగోళిక మార్పులతో రూపు దిద్దుకున్న ఈ శిలాతోరణం ఎంతో ప్రాచినమైనదిగా చెప్పబడుతోంది. ఈ శిలాతోరణం భారతదేశంలోనే కాకుండా ఆసియా, ఐరోపా ఖండాల్లో కూడా ఎంతో ప్రసిద్ది గాంచింది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో రెండు ప్రదేశాల్లోనే ఉన్నాయి. అమెరికాలోనీ ఉటా ప్రాంతంలోని ఇంధ్రధనుస్తోరణ, ఇంగ్లాండ్ లోని డాల్రాడియన్ శిలాసేతువు మాత్రమే ఉన్నట్లు పరిశోధకుల ద్వారా మనకు తెలుస్తోంది.
ఈ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా చేశారు. స్వామి వారు ధరించే శంఖు,చక్రాలే.. ఈ శిలాతోరణం రూపంలో దర్శనం ఇస్తున్నాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirumala, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd news