Gorantla Madhav: ‘అంతా నా ఇష్టం.. నాకు రూల్స్ లేవు’ అంటున్న ఎంపీ గోరంట్ల మాధవ్.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ అదే వరస..!

మెడికల్ కాలేజీ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కొన్నిసార్లు ప్రవర్తించే తీరుపై పెద్ద చర్చ జరిగి రచ్చకు దారితీసిన సందర్భాల్లో గతంలో చాలానే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ హిందూపురం ఎంపీ రూటే సపరేటు. ఆయన సిఐగా పనిచేస్తున్న నాటి నుంచి ఎంపీ అయిన నేటి వరకూ తన పంథా ‘అంతా నా ఇష్టం’ అన్నట్టుగానే సాగింది.

 • Share this:
  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కొన్నిసార్లు ప్రవర్తించే తీరుపై పెద్ద చర్చ జరిగి రచ్చకు దారితీసిన సందర్భాల్లో గతంలో చాలానే ఉన్నాయి. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ హిందూపురం ఎంపీ రూటే సపరేటు. ఆయన సిఐగా పనిచేస్తున్న నాటి నుంచి ఎంపీ అయిన నేటి వరకూ తన పంథా ‘అంతా నా ఇష్టం’ అన్నట్టుగానే సాగింది. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు వచ్చే ప్రతి పౌరుడు మాస్కులు తప్పక ధరించాలనే నిబంధనలు విధించాయి. బయట మాస్కులు లేకుండా వచ్చిన వారికి పోలీసులు కచ్చితంగా జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తనకు ఏమి కాదులే అనుకున్నారేమో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాస్కును ధరించకుండానే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయన మాస్కు లేకుండా బయటకు రావడం ఇదేం కొత్త కాదంటున్నారు హిందూపురం ప్రజలు. తాజాగా ఏపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి పెనుకొండ సమీపంలోని గొర్రెల పెంపక క్షేత్రం వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటిస్తూ.... మాస్కులు ధరించి ఉన్నారు. కానీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాత్రం తనకు ఎలాంటి నిబంధనలూ వర్తించవన్నట్లు మాస్కు లేకుండానే కార్యక్రమంలో పాల్గొన్నారు.

  భారీ ఎత్తున్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పటికీ మాస్కు ధరించాలని ఎంపీకి ఎవరూ సూచించకపోవడం గమనార్హం. మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా మాస్క్ ధరించమని ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెప్పే సాహసం చేయలేదు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌లో తీవ్ర రూపం దాల్చి మానవాళిని కబళించి వేస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి ఎంపీనే మాస్క్ ధరించకుండా సభ్య సమాజానికి ఆయన ఏం మెసేజులిద్దామని భావిస్తున్నారో తెలియడం లేదని నియోజకవర్గంలో చర్చ మొదలైంది.

  ఇది కూడా చదవండి: Jagan Bail: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ.. తాజా పరిణామం ఏంటంటే..

  పైగా కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు తూచాతప్పకుండా పాటించేలా చూడటం కోసం పోలీసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న ఈ తరుణంలో ఎంపీ గతంలో పోలీసుగా పనిచేసిన అనుభవం ఉండి కూడా కనీసం మాస్క్ పెట్టుకోకపోవడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పడటంతో కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తున్నారు. మాస్క్ ధరించకపోతే సామాన్యులకు మాత్రమే జరిమానాలు విధిస్తున్నారని... ఎంపీ గోరంట్ల మాధవ్‌లా నిబంధనలను తుంగలో తొక్కి మాస్క్ ధరించని పెద్ద సార్లకు ఎందుకు జరిమానా విధించడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

  నలుగురికి చెప్పాల్సిన నాయకులే ఇలా చేస్తుంటే ఎలా అనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన హిందూపురం నియోజకవర్గంలోని కొందరు ‘సాక్షాత్తు ఎంపీయే మాస్క్ పెట్టుకోడు.....మేము ధరించకపోతే తప్పెలా అవుతుంది’ అని ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని వినికిడి. ‘ముందు ఎంపీకి చెప్పి తరువాత మా వద్దకు రండి సారూ’ అని అంటున్నారట జనం. ప్రజాప్రతినిధులే ఇలా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా.. మాస్క్‌లు లేకుండా యథేచ్చగా తిరిగితే కరోనా వ్యాప్తికి ఎలా అడ్డుకట్ట వేస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  Published by:Sambasiva Reddy
  First published: