భక్తుల విరాళాలతో ఉద్యోగులకు నజరానా.. టీటీడీపై విమర్శలు

టీటీడీ ఉద్యోగుల ప్రస్తుత జీతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల జీతాల కంటే ఎక్కువే. పరకామణితో పాటు వివిధ స్ధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతభత్యాలతో పాటు ప్రతీ కార్యానికీ అదనపు మొత్తాలను అందుకుంటూనే ఉన్నారు.

news18-telugu
Updated: October 28, 2019, 7:20 PM IST
భక్తుల విరాళాలతో ఉద్యోగులకు నజరానా.. టీటీడీపై విమర్శలు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చేందుతున్న క్రమంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం అయినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
  • Share this:
దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరుతెచ్చుకున్న తిరుమలలో స్వామి వారికి వచ్చే ఆదాయం వృథా కూడా అదే స్ధాయిలో ఉంటోంది. తిరుమలలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తమ ఉద్యోగులకు రూ.22 కోట్ల విలువైన నజరానాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది పొడవునా జీతభత్యాలు అందుకుంటున్న ఉద్యోగులకు భక్తుల విరాళాలను ప్రత్యేకంగా బ్రహ్మోత్సవ బహుమానాల పేరుతో అందించడం సరికాదనే వాదన వినిపిస్తోంది.

తిరుమలలో తాజాగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్ధానం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో తిరుమల, తిరుపతితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న టీటీడీ కార్యాలయాల్లో వివిధ స్ధాయిల్లో రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా పని చేశారు. అయితే వీరికి బ్రహ్మోత్సవ బహుమానాల రూపంలో టీటీడీ నజరానాలు అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు అయితే ఒక్కొక్కరికీ రూ.14 వేల చొప్పున, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అయితే రూ.6,850 చొప్పున నజరానాలు అందించింది. ఈనెల 23న సమావేశమైన టీటీడీ బోర్డు ఈ నజరానాలకు ఆమోద ముద్ర వేసింది. దీనిపై హైందవ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


దేశంలోని మిగతా ఆలయాలతో పోలిస్తే తిరుమల తిరుపతి దేవస్ధానం ఎంతో సంపన్నమైనది. ప్రతీ రోజూ కోట్లాది రూపాయల నగదు, కానుకలు భక్తులు శ్రీవారికి భక్తులు సమర్పిస్తుంటారు. వీటిని టీటీడీ బోర్డు తరఫున దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ విద్యాలయాలు, ధార్మికసంస్ధల నిర్వహణకు వినియోగిస్తుంటారు. దీంతోపాటు తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా సదుపాయాల ఏర్పాటు కోసం,, ప్రసాదాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. వీటిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ శ్రీవారికి హుండీ కానుకల రూపంలో వచ్చిన డబ్బును ఉద్యోగులకు నజరానాల రూపంలో పంచిపెట్టడం సరికాదనే వాదన వినిపిస్తోంది. గతంలో 1990లో ఉద్యోగుల జీతంలో 15 రోజుల బేసిక్ పే పేరుతో గరిష్టంగా వెయ్యి రూపాయల మొత్తాన్ని "బ్రహ్మోత్సవ బహుమానం" రూపంలో ఇచ్చేవారు. అది ఇప్పుడు 14 వేలకు చేరింది. గత మూడేళ్లలో టీటీడీ "బ్రహ్మోత్సవ బహుమానం" పేరుతో ఉద్యోగులకు ఇచ్చిన నజరానా మొత్తం రూ.60 కోట్ల పైమాటే.

Tirumala Srivari Brahmotsavam Chinna Sesha Vahanam Seva, Video: చినశేషవాహనంపై భక్తులకు శ్రీవారి దర్శనం
తిరుమలలో చినశేషవాహనంపై స్వామివారు


టీటీడీ ఉద్యోగుల ప్రస్తుత జీతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల జీతాల కంటే ఎక్కువే. అయినా ఇలా కానుకల రూపంలో కోట్లాది రూపాయల మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు. శ్రీవారి సేవ పేరుతో భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తాన్ని ఉద్యోగులు తీసుకోవడం పాపమే అవుతుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే పరకామణితో పాటు వివిధ స్ధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ జీతభత్యాలతో పాటు ప్రతీ కార్యానికీ అదనపు మొత్తాలను అందుకుంటూనే ఉన్నారు. అయినా ఇంకా టీటీడీ "బ్రహ్మోత్సవ బహుమానం" పేరుతో వారికి కోట్లాది రూపాయల మొత్తాన్ని కట్టబెట్టడం సరికాదని హైందవ సంస్ధలు విమర్శిస్తున్నాయి.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: October 28, 2019, 7:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading