HIGH COURT EXPRESSED UNHAPPINESS OVER AP GOVERNMENT REGARDING MISSION BUILD ANDHRA PRADESH AK
YS Jagan Mohan Reddy: ఏపీ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి.. అందరికీ తెలుసు అంటూ చురకలు
ప్రతీకాత్మక చిత్రం
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల కోసం ఆస్తులు అమ్మాల్సిన పరిస్థితులు ఉన్నాయా ? అని ప్రశ్నించింది.
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉందా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉందా ? అని వ్యాఖ్యానించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరిట భూముల విక్రయంపై జరిగిన వాదనల్లో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎవరూ చేయని సంక్షేమ కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. అయితే దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రభుత్వం ఎంత బాగా పథకాలు అమలు చేస్తుందో అందరికీ తెలుసని చురకలు వేసింది.
కరోనా సమయంలో ప్రభుత్వం అధిక ధరకు మద్యం విక్రయించిందని.. ఆ సమయంలో రాష్ట్ర సంక్షేమానికి పాటుపడిన మందుబాబులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందేనని హైకోర్టు వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ఆస్తుల అమ్మకాన్ని నివారించాలని పది పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం... తదుపరి విచారణను 17కు వాయిదా వేసింది.
ఏపీలో మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎన్బీసీసీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మిషన్‌లో భాగంగా ప్రభుత్వ భూములను గుర్తించి, భవన సముదాయాలు నిర్మించే తలంపులో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటిని మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాలను సేకరించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు అందజేయాలని జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మిషన్ బిల్డ్ ఏపీకి డైరక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ఇక విజయవాడలో బిల్డ్ ఏపీ మిషన్ తొలి ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. బిల్డ్ ఏపీ మిషన్ అమల్లో భాగంగా నిధుల సమీకరణ కోసం రెండెకరాల భూమిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.