ఉమ్మడి హైకోర్టు విభజనపై నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను కూడా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే, కేవలం నాలుగు రోజుల్లో ఏపీకి వెళ్లిపొమ్మంటే ఎలా అంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వైఖరిపై రెండు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో విభజన తీరు మీద వాడివేడి చర్చ జరిగింది. దీనిపై సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని తీర్మానించారు.

అమరావతిలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు భవనం
ఏపీకి వెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, అయితే, సదుపాయాలు మాత్రం సరిగా లేవని ఏపీ న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడు రామన్న దొర ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ తెలిపారు. ఉదయం లేస్తే, సహజ న్యాయసూత్రాల గురించి మాట్లాడే న్యాయవ్యవస్థలో కనీసం ఆ ప్రాధమిక అంశాన్ని కూడా పాటించినట్టు కనపడడం లేదన్నారు. రెండు మూడురోజుల్లోనే వెళ్లమనడం మీదే తమ అభ్యంతరం ఉందని స్పష్టం చేశారు. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.

హైకోర్టు విభజనకు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్
ఏపీలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్తయితే తమకు అభ్యంతరాలు ఉండేవి కావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్వహణకు ఏర్పాట్లు చేసినా.. న్యాయవాదుల పరిస్థితి ఏంటని రామన్న దొర ప్రశ్నించారు. ఒక రోజులో సుమారు వెయ్యి మంది న్యాయవాదులు హైకోర్టుకు వస్తారని రామన్న దొర చెప్పారు. వారికి ఎలాంటి వసతులు కల్పిస్తారని ప్రశ్నించారు. ఇది తమ కంటే కూడా తమ క్లయింట్లకు ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Published by:Ashok Kumar Bonepalli
First published:December 29, 2018, 02:21 IST