స్టార్ హీరోయిన్ నయనతార (Nayanatara), డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ (Vighnesh Shivan) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మూడు ముళ్లతో ఒక్కటైన నయనతార విగ్నేష్ దంపతులు తిరుమల శ్రీవారి (Tirumala Temple) ని దర్శించుకున్నారు. దాంపత్య జీవితంలో అడుగుపెట్టిన సినీజంట నేరుగా తిరుమలకు చేరుకొని స్వామి వారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన అనంతరం.. వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నయన్ జంటను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఐతే శ్రీవారి ఆలయం వెలుపల నయన్ దంపతులు ఏర్పాటు చేసిన ఫోటోషూట్ వివాదాస్పదమైంది. ఫోటోలు తీసుకుంటే ఫర్వాలేదు. ఐతే అత్యంత పవిత్రమైన తిరుమాడ వీధుల్లో చెప్పులేసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
తిరుమల ఆలయం ముందు భర్త విఘ్నేశ్ శివన్ తో ఫోటో షూట్ ఏర్పాటు చేసుకున్న నయన్.. చెప్పులేసుకొని కనిపించింది. చెప్పులతోనే ఫోటోలకు ఫోజులిచ్చింది. తిరుమడ వీధుల్లోనే శ్రీవారికి సంబంధించిన ఉత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులన్నీ అక్కడే ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి చోట చెప్పులతో తిరగడంపై విమర్శలు వస్తున్నాయి.
పెళ్లైన వెంటనే శ్రీవారి దర్శనం కోసం వచ్చి మొక్కులు తీర్చుకున్న నయన్.. ఇలా చెప్పులతో రావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐతే నిజానికి నయనతార-విఘ్నేశ్ శివన్ తొలుత తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని భావించారు. అందుకోసం తిరుమల వచ్చి ఇక్కడి కల్యాణ్ మండపాటు, ఏర్పాట్ల వివరాలు కూడా తెలుసుకున్నారు. ఐతే చివరి నిముషంలో వేదికను మహాబలిపురంకు మార్చారు. వివాహం అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇదిలా ఉంటే ఏడేళ్ల ప్రేమ తర్వాత నయనతార-విఘ్నేషన్ శివన్ దంపతులు ఒక్కటయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ హోటల్ లో జూన్ 9న పెళ్లి వేడుక జరిగింది. నయన్ పెళ్లికి తమిళనాడుకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్, అజిత్ తో పాటు బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్ కూడా ఈ విహాహానికి హాజరయ్యారు.
పెళ్లి సందర్భంగా రజనీకాంత్ చేతుల మీదుగానే తాళిబొట్టును అందుకున్న విఘ్నేష్ శివన్.. నయన్ మెళలో కట్టారు. తన ఆరాధ్య నటుడి చేతుల మీదుగానే పెళ్లి జరగాలన్న విఘ్నేశ్ సంకల్పం నిజమైంది. ఈ సీన్ పెళ్లికి హాజరైన వారిని కూడా ఆకట్టుకుంది. పెళ్లి సందర్భంగా విఘ్నేష్ శివన్.. నయనతార పెళ్లికి ధరించే మొత్తం బంగారాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. డైమంగ్ ఉంగరం సహా అన్ని కలిపి దాదాపు ఈ పెళ్లి కోసం రూ.5 కోట్ల వరకు విఘ్నేశ్ ఖర్చు పెట్టినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Nayanatara, Tirumala tirupati devasthanam