Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ ఫైట్ (PRC Issue) తారాస్థాయికి చేరింది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు డిసైడ్ అయ్యాయి. అసలు పీఆర్సీపై ఉద్యోగుల ప్రధాన అభ్యంతరాలేంటి..? ప్రభుత్వం ఇచ్చిన హామీకి.. అమలు చేసిన దానికి తేడాలేంటి. ప్రస్తుత పీఆర్సీతో వారికి నష్టం ఎలా..? తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ప్రభుత్వంపై లోలోన రగిలిపోతున్న ఉద్యోగులు ఇప్పుడు పీ.ఆర్సీ తగ్గింపుతో భగ్గుమన్నారు. ఆర్ధిక పరిస్థితి మెరుగైందని ఒకవైపు ప్రకటిస్తూనే తమ జీతాల విషయంలో మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరడం చూస్తుంటే ప్రభుత్వం తమని ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నంలా ఉందంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు.
అవగాహన లేకనే అప్పట్లో సి.పి.ఎస్ రద్దు గురించి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారమే రేపాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే (ఐ.ఆర్) మధ్యంతర భృతిని 27% కి పెంచామని ఇప్పుడు సి.ఎస్ కమిటీ నివేదిక ప్రకారమే 23.4%కి ఖాయం చేశామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. తమకు 34% హెచ్ ఆర్ ఏ కావాలని అడిగితే అప్పట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకూ మధ్యంతర భృతి తీసుకోవాలని ప్రభుత్వం ఉద్యోగులను కోరింది.
ప్రభుత్వం తమకు న్యాయంచేస్తుందనే నమ్మకంతో అప్పుడు ఉద్యోగులు ఐ.ఆర్ కు ఒప్పుకున్నారు. ఐతే ఇప్పుడు ఐ.ఆర్ కంటే హెచ్ ఆర్ ఏ తక్కువ ఉండటం ఉద్యోగుల కొపానికి కారణం ఐంది. తాత్కాలిక చెల్లింపులు ఎప్పుడూ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అప్పట్లో ఉద్యోగులు కూడా మధ్యంతర భృతి కంటే ఎంతో కొంత ఎక్కువ తమకు పి.ఆర్సి పెరుగుతుందనే భావనలోనే ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఐ.ఆర్ కంటే తక్కువ హెచ్.ఆర్.ఏ ప్రకటించడం వారికి మంటపుట్టించిందనే చెప్పాలి.
ఇకపై కేంద్ర ప్రభుత్వంతో పాటు హెచ్ ఆర్ ఏ అమలు చేస్తామని చెప్పడం కూడా ఉద్యోగులకు కోపం తెప్పించింది. కేంద్రం పదేళ్ళకోసారి పి.ఆర్సీ వేస్తుందని వారితో పాటు మాకు పి.ఆర్సీ అంటే కుదరదు అని వారంటున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వంతో పాటు పి.ఆర్సీ అమలు చేస్తున్న గుజరాత్ , ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు భాజపా పాలిత రాష్ట్రాలేకదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంలో మరోముఖ్యమైన అంశం ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 నుండి 62 ఏళ్ళకు పెంపు. ఇప్పటికే ప్రభుత్వం నలభైవేల మంది ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయి పడిందని, పదవీ విరమణ వయసు పెంపుతో రెండేళ్ళ పాటు ఆర్ధిక భారం తగ్గించు కోవడమే ప్రభుత్వ లక్ష్యం తప్ప తమని ఉద్దరించడానికి కాదనేది ఉద్యోగుల వాదన. పైగా దీని వలన నిరుద్యోగ యువత కు అన్యాయం జరుగుతుందనేది మరో వాదన. గ్రామసచివాలయాలు పేరుతో రెండులక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం వారిని తమకు సమాంతరంగా పోటీవ్యవస్తలా తయారు చేయాలని ప్రయత్నిస్తుందని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్నరోజులలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేమాటే ఉండదు అంటున్నారు ఉద్యోగులు.
కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటూనే నవరత్నాలు పేరిట ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్ఛుల వల్లే ఖజానా పై భారం పెరిగేలా చేసిందని, తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీనే నెరవేర్చమని తాము అడుగుతున్నామనేది ప్రభుత్వ ఉద్యోగుల వాదన. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా ఇలా పార్టీ తరఫున ఉద్యోగులకు వ్యతిరేకంగా సర్క్యులర్లు జారీ చేయడం మంచిపద్దతి కాదని ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తాము సమ్మెబాట పట్టక తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఐతే ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees