ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును (3 Capitals bill) రద్దు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీంతో మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేయనున్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లును రద్దు చేయడంతో చేస్తూ కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గత రెండేళ్లుగా పాలనా వికేంద్రీకరణ బిల్లు రాష్ట్రంలో టెన్షన్ వాతావరణానికి దారితీసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కోర్టు వరకు వెళ్లడం, రైతుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఐతే సీఎం జగన్ ప్రకటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టినప్పటి నుంచి రద్దు చేసేవరకు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో ప్రకటన నుంచి రద్దు వరకు పరిణామాలను పరిశీలిస్తే..
ఇక పూర్తిస్థాయిలో బిల్లును వెనక్కి తీసుకుంటారా..? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఐతే బిల్లుకు సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతారన్న చర్చ జరుగుతోంది. గతంలో చేసిన చట్టంలో అనేక లోపాలు ఉండటంతో వాటిని పూర్తిస్థాయిలో మార్చి మళ్లీ ప్రవేశపెడాతరన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో రైతులకు పరిహారం, ఇతర అంశాలను సవరణ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మళ్లీ వచ్చే సమావేశాల్లో మార్పులు, చేర్పులు చేసి కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారా..? చట్టంలో మార్పులు చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకెళ్తారా..? అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, Ap capital