EWS Reservation in AP: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక జీవో.. మార్గదర్శకాలు ఇవే..

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు (EWS Reservations) కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు జీవో జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ వర్తించనుంది. అలాగే ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితిని రూ.6లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగణంగా మెమో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు అధికారిక సమాచారం ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు, కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ రిజర్వేషన్ లేని ఇతర సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరనుంది.

    గతంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5శాతాన్ని కాపులకు.. మరో ఐదు శాతాన్ని ఇతర ఓసీ వర్గాలకు కేటాయించడంపై తీవ్ర దుమారం రేగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజ్వేషన్ ను అన్ని అగ్రవర్గాలకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మోమో జారీ చేసింది. తాజా జీవోతో ఉద్యోగ అవకాశాల్లోనూ అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ వచ్చినట్లైంది.

    ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో


    ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో


    ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి జారీ చేసిన మెమో


    ఇవీ మార్గదర్శకాలు
    రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌ కేటగిరీలలోకి రాని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉంటేనే ఇది వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్‌ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింద కల్పించే 10 శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆయా సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    కేంద్రం ఏం చెప్పిందంటే..!
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపుకు పలు నిబంధనలు విధించింది. ఈ కేటగిరీలోకి రావాలంటే సదరు కుటుంబానికి ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు. నగరాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఫ్లాట్ ఉండకూడదు. ఇళ్లస్థలాల విషయానికి వస్తే నగరాల్లో అయితే వంద గజాలు, గ్రామాల్లో అయితే రెండొందల గజాలకు మించి ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్ వర్తించదు. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నిబంధనలన్నీ పక్కనబెట్టేసి వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించ కూడదనే రూల్ మాత్రమే పొందుపరిచింది.
    Published by:Purna Chandra
    First published: