ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ముగిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు, సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు, సోలార్ విద్యుత్, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు రెండు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్రవేసింది. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిట్ కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించింది. సినిమా టికెట్ల వివాదం ఇటీవల చర్చనీయాంశమైన నేపథ్యంలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఈడబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. అలాగే రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు అదనంగా మరో రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేయనుంది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలో 5 చోట్ల సెవన్ స్టార్ పర్యాటన రిసార్ట్ ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధితో పాటు విశాఖపట్నంలో తాజ్వ రుణ్ బీచ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖపట్నంలోని మధురవాడలో అదానీ సంస్థకు 130 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపింది. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాలు, శ్రీశారదా పీఠానికి విశాఖ జిల్లా కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తిలిపింది. ఇక నవంబర్ 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఇది చదవండి: క్రిస్టియన్ కు టీటీడీలో సభ్యత్వం..? వైసీపీ ఎమ్మెల్యే మతంపై వివాదం.. ఆయన ఏమన్నారంటే..!
అలాగే దేవాదాయ శాఖలో మార్పులపై కేబినెట్ చర్చించింది. దేవాదాయ శాఖ స్థలాలు, షాపుల లీజులు, ఇతర అంశాలపై చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై చర్చ జరిగింది. అలాగే వచ్చేఏడాదిలో అమ్మఒడి పథకంపై చర్చించిన మంత్రివర్గం.. ప్రతి విద్యార్థికి 75శాతం హాజరు తప్పనిసరి అనే అంశంపై ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రకాశం జిల్లా వాడరేవుతో సహా ఐదు ఫిషింగ్ హార్బర్ల డీపీఆర్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం అమలు చేసే పథకాలకు అర్హతలుండి.. అనర్హుల జాబితాలో ఉంటే ప్రతి ఏడాది జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి మరోసారి పరిశీలించి పథకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, Ap government