Heavy rains to Andhra Pradesh: వర్షాకాలం పోయినా వానలు ఏపీని వదిలే లేవు. ఇప్పటికే ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. మరోసారి భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి (Amaravati)వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి ఇవాళ అల్పపీడనంగా మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనిప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడులపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీంతో ఇవాళ, రేపు, అలాగే 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే భారీ వానలతో చిత్తూరు (chitoor) , నెల్లూరు జిల్లాలు (Nellore district) తీవ్రంగా దెబ్బ తిన్నాయి. మరోసారి హెచ్చరికలు భయపెడుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: నామినేషన్ల ఉప సంహరణ రచ్చ రచ్చ.. ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు.. ఆందోళనలు
తెలంగాణలోని భారీ వానలు అటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో.. అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక భారీ వర్షాల కారణంగా వరి మరియు పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా చేను పైనే ఉండటంతో… నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో మరో రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, కేరళ, పాండిచేరిలోనూ రాబోయే నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
ఇదీ చదవండి: కుదరదని తేల్చేసిన ప్రభుత్వం.. నేడు ఆందోళనలకు చంద్రబాబు పిలుపు
విశాఖ ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు
వర్షాలకు తోడు.. వింటర్ సీజన్ రావడంతో విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూడురోజుల నుంచి చలిగాలులు అధికమవడంతోపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలుల తీవ్రత నెలకొంటోంది. అర్ధరాత్రి నుంచే దట్టంగా పొగమంచు కురుస్తోంది. సోమవారం జి.మాడుగులలో 10.5 డిగ్రీలు, డుంబ్రిగుడలో 10.7, పెదబయలులో 11.1, అరకులోయలో 11.4, ముంచంగిపుట్టులో 11.5, హుకుంపేటలో 12.1, పాడేరులో 12.5, చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Heavy Rains, Nellore Dist, Weather report