news18-telugu
Updated: November 24, 2020, 4:33 PM IST
ప్రతీకాత్మక చిత్రం
నివర్ తుపాను ఏపీలో తీరం దాటకపోయినా.. దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. నివర తుపాను ప్రభావం, నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాయలసీమ,నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం... రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు తుపాను ప్రభావం ఉండొచ్చని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఉండాలని వెల్లడించారు.
నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని సీఎం జగన్ అన్నారు. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని.. ఆర్బీకే ద్వారా రైతులకు సూచనలు పంపాలని అన్నారు. కోత కోసిన పంటలను ఎలా రక్షించుకోవాలో వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.
చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. గ్రామ సచివాలయ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని.. తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అన్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 24, 2020, 4:33 PM IST