ఏపీని బురేవి తుపాను వణికిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా తిరుమలలోనూ ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంతంలో మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. దీంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లపై కొండచరియలు, వృక్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. బురేవి తుఫాన్ గురువారం సాయంత్రానికి తమిళనాడులోని పంబన్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి శుక్రవారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణ శాఖ వివరించింది.
ఇక తిరుమలలో వారం క్రితం నివర్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమలలోని జలాశయాలు నిండాయి. పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను అధికారులు ఎత్తారు. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీవారి ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ప్రహారీ గోడ కూలడంతో రెండు బైక్లు ధ్వంసం అయ్యాయి. నివర్ తుపాను బీభత్సం నుంచి తేరుకోకముందే తిరుమలలో మళ్లీ భారీ వర్షం కురుస్తుండటంతో.. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.