కర్నూలు మళ్లీ మునిగిపోతుందా.. భారీ వరదలతో ప్రజలు బెంబేలు..

Floods: తుంగభద్రలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో బోర్డు అధికారులు కర్నూలులోని ముంపు ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తమైన అధికారులు పట్టణవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 12, 2019, 5:24 PM IST
కర్నూలు మళ్లీ మునిగిపోతుందా.. భారీ వరదలతో ప్రజలు బెంబేలు..
ఉగ్ర రూపం దాల్చిన తుంగభద్ర నది
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు వరద ముప్పు పొంచి ఉంది. అప్రమత్తమైన అధికారులు పట్టణవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుత వరదలు 2009 నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. తుంగభద్రలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తుంగభద్ర బోర్డు అధికారులు కర్నూలులోని ముంపు ప్రాంత ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు. కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు డ్యామ్ లోకి వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ నిండుతుండటంతో గేట్లు ఎత్తి 50వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో కర్నూలుకి వరద ముప్పు పొంచి ఉంది. మున్ముందు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే ఛాన్స్ ఉంది.

ఇక, తుంగభద్ర డ్యామ్‌లోకి 2.1 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ కెపాసిటీ 100.84 టీఎంసీ అడుగులు. ప్రస్తుతం 76.37 టీఎంసీ అడుగుల నీరు ఉంది.2009లో కర్నూలును వరదలు ముంచెత్తడంతో ఆ పట్టణం మునిగిపోయింది. జూరాల నుంచి శ్రీశైలానికి వచ్చిన నీరు.. కర్నూలులోని జమ్మిచెట్టు ప్రాంతాన్ని తాకింది. దీంతో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా అని అధికారులు, ప్రజలు భయపడుతున్నారు. శ్రీశైలం డ్యామ్ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. దశాబ్ద కాలంలో 2.1లక్షల క్యూసెక్కుల నీరు రావడం రికార్డు.

మరోవైపు, శ్రీశైలం డ్యామ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి రికార్డు స్థాయిలో 5లక్షల 87వేల 420 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ కెపాసిటీ 885 అడుగులు. ప్రస్తుతం 883 అడుగుల వరకు నీరు ఉంది. ఈ డ్యామ్ కెపాసిటీ 215.81 టీఎంసీ అడుగులు. ప్రస్తుతం 204.78 టీఎంసీల అడుగుల నీరుంది. ప్రస్తుతం అధికారులు 10 గేట్లు తెరిచారు. 4 లక్షల 25వేల 521 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు