news18-telugu
Updated: September 27, 2020, 5:03 PM IST
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. పది గేట్లు ఎత్తివేత
భారీగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, డ్యాంలు నీటితో నిండిపోయాయి. అనేక చోట్ల పంటలు నీట మునగడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి నలుదిక్కుల నుంచి వదర నీరు పోటెత్తుతోంది.
శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ 10 గేట్లను అధికారులు ఎత్తివేశారు. వరద ప్రవాహం భారీగా ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. తద్వార నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,90,469 క్యూసెక్కులు నమోదైంది. ఔట్ ఫ్లో 5,05,199 క్యూసెక్కులుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 884.70 అడుగుల మేర నమోదవుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 213.8824 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని అధికారులు ప్రకటించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Published by:
Nikhil Kumar S
First published:
September 27, 2020, 1:25 PM IST