ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇండియన్ ఆర్మీ లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయం చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని స్వగ్రామం ఎగువరేగడపల్లెకు చేరుకుంది. కుటుంబీకులు, బంధువులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ పార్ధివదేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. అమర జవాన్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు అశేషంగా సాయితేజ ఇంటికి చేరుకున్నారు. పార్థివదేహం ఇంటికి చేరడానికి కొద్ది నిమిషాల ముందు సాయితేజ ఇంట్లో హృదయం ద్రవించే దృశ్యాలు చోటుచేసుకున్నాయి..
సాయితేజ ఫొటోకు ఐదేళ్ల కొడుకు మోక్షజ్ఞ ముద్దు పెట్టుకున్న దృశ్యం అక్కడున్న అందరికీ కంటతడి పెట్టించింది. ‘ఐ లవ్ యూ డాడీ..’అంటూ చిన్నారి మోక్షజ్ఞ తండ్రి ఫొటోను ఆప్యాయంగా నిమిరాడు. తిరిగిరాని లోకాలకు వెళ్లాడని స్పష్టంగా తెలియకున్నా తన తండ్రి పట్ల ఆ చిన్నారికున్న అనుబంధాన్ని తలచుకుంటూ బంధువులు రోదించారు.
జవాన్ సాయితేజ ఇద్దరు పిల్లలు, కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2)
జవాన్ సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్‌బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్‌లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు. చనిపోవడానికి కొద్ది గంటల ముందు, అంటే, బుధవారం ఉదయం 8.45 గంటలకు సాయితేజ తన భార్యతో మాట్లాడారు.‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా’అన్నవే అతని చివరి మాటలు. ఆ రోజు మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, సాయితేజ సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందారు.
జవాన్ సాయితేజ అంత్యక్రియలు స్వగ్రామం ఎగువరేగడపల్లెలో జరుగుతున్నాయి. గ్రామంలోని మైదానంలో భౌతికకాయాన్ని ఉంచనున్న ఆర్మీ అధికారులు.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయితేజ పార్థివదేహం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించగా, దాదాపుగా 25 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chitoor, Indian Army, Sai teja