HEALTH DEPARTMENT EMPLOYEES READY TO PARTICIPATE IN EMPLOYEES PROTEST FOR PRC FULL DETAILS HERE PRN
AP Employees Strike: కరోనా సమయంలో జగన్ సర్కార్ కు షాక్..? సమ్మెలోకి కీలక శాఖ ఉద్యోగులు..?
ఫైల్ ఫోటో
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్ (PRC Issue) కొనసాగుతోంది. పీఆర్సీ లెక్కలకు నిరసనగా వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. దీనికి ఆర్టీసీతో పాటు మరో కీలక శాఖకు చెందిన ఉద్యోగులు మద్దతు తెలపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్ (PRC Issue) కొనసాగుతోంది. పీఆర్సీ లెక్కలకు నిరసనగా వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఇప్పటికే పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయలు, కార్మికులు, పెన్షనర్లతో కూడిన పీఆర్సీ సాధన సమితి సమ్మెపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సీఎస్ సమీర్ శర్మకు నోటీసులిచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమయ్యారు. సీఎస్ అందుబాటులో లేకుంటే ఆయన కార్యాలయంలో నోటీసులివ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఉద్యోగులతో చర్చల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీని చర్చలకు ఆహ్వానించినా పీఆర్సీ సాధన సమితి మాత్రం నిరాకరించింది. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేసింది.
ఉద్యోగుల సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత స్పష్టం చేశారు. డిమాండ్ల సాధన కోసం రవాణా వ్యవస్థను స్తంభింపజేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ సిబ్బంది సమస్యలు తీరలేని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇస్తారని భావించామని, ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19 శాతం ఐఆర్ తేడాగా ఉందని వెల్లడించారు.
ఇప్పటికే ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో జగన్ సర్కార్ సతమతమవుతోంది. తాజాగా మరో శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో చేరనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని వైద్యారోగ్య సిబ్బంది తెలిపింది. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు దశల వారి ఉద్యమానికి ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ( హంస) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్( ఏపీ హంస) అధ్యక్షుడు అరవ పాల్ స్పష్టం చేశారు. పీఆర్సీ జివోలు రద్దు చేయాలని.. చర్చలు ముగిసే వరకు పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 11 పీఆర్సీ పై అశితోష్ మిశ్రా కమిటీ నివేదికను అమలు చేయాలని.. ఈ పోరాటంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. కరోనా, ఇతర వైద్య సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది సమ్మెకు దిగితే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముంది.
పీఆర్సీపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం, ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు అగ్రహంగా ఉండటంతో ఈ వ్యవహారానికి ముగింపు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సమ్మెకు వెళ్లేందుకే ఉద్యోగులు సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రుల కమిటీ ఎలాంటి సంప్రదింపులు జరుపుతుందో చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.