ఏపీలో దేవాలయాలపై దాడులు.. డీజీపీ కీలక ప్రకటన

ప్రజలు సోషల్ మీడియా పుకార్లపైన, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలకు సహకరించే విధంగా ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: September 28, 2020, 10:11 PM IST
ఏపీలో దేవాలయాలపై దాడులు.. డీజీపీ కీలక ప్రకటన
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
  • Share this:
అంతర్వేది సంఘటన మొదలుకొని ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ఆలయ ఆస్తులపై దాడికి సంబంధించి మొత్తం వివిధ ప్రాంతాలలో 19 కేసులు నమోదయ్యాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వీటిలో 12 కేసులను చేధించి నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మరో ఏడు కేసుల్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని.. త్వరలోనే ఆ కేసులను కూడా చేధిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కేసులన్నీ ఒక కేసుతో ఇంకో కేసుకు సంబంధం లేదని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ సంఘటనలన్నింటికి సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వీటిపై పూర్తి వాస్తవాలను ప్రజలకు అందించాల్సిన భాధ్యత మాపై ఎంతైనా ఉందని అన్నారు.

శ్రీకాకుళం సంఘటనలో విగ్రహం చేయిని ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయని.. అయితే అది గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా పడిపోయినట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. అదే విధంగా కర్నూలు సంఘటన విషయానికి వస్తే, విగ్రహంలోని కొన్ని అంతర్గత భాగాలను తొలగిస్తే తన భార్య గర్భం ధరిస్తుందని మూడనమ్మకంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పట్టుబడిన నిందితుడు వెల్లడించాడని తెలిపారు. మరికొన్ని సంఘటనలలో విగ్రహాల క్రింద దాగి ఉన్న గుప్తనిధుల కోసం వేటాడుతున్న ముఠాలు దాడులకు పాల్పడ్డాయని అన్నారు. ఆలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద భద్రత కోసం పోలీసు శాఖ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి డీజీపీ సవాంగ్ వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 47593 ప్రార్థనా స్థలాలను గుర్తించి వాటిని మ్యాపింగ్, ఆడిట్ పూర్తి చేశామని అన్నారు. వాటిలో 28,567 దేవాలయాలు ఉండగా కేవలం 10% మాత్రమే సిసిటివి కెమెరాలు ఉన్నాయని తెలిపారు. సిసిటివిలను ఏర్పాటు చేయడం, అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 మేరకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించామని వివరించారు. రెండు వారాలలో 886 దేవాలయాల వద్ద స్వయంగా పోలీస్ శాఖ ద్వారా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందని అన్నారు. నిన్న సాయంత్రం చిత్తూరులోని ఒక ఆలయంలోని నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు అందిందని.. దానిపైన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

రాష్ట్ర విభజన తరువాత(2015-2020) దేవాలయాలపైన జరిగిన దాడులతో పోల్చుకుంటే 2020 లో కేవలం 228 మాత్రమే జరిగినట్లు గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి 2015లో 290 కేసులు, 2016లో 322, 2017లో 318, 2018లో 267, 2019లో 305, 2020లో 228 కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రజలు సోషల్ మీడియా పుకార్లపైన, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో పుకార్లు నమ్మకుండా శాంతిభద్రతలకు సహకరించే విధంగా ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading