హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Eluru Disease: వింత వ్యాధిపై వీడని మిస్టరీ... నీటి కాలుష్యమే కారణమా..?

Eluru Disease: వింత వ్యాధిపై వీడని మిస్టరీ... నీటి కాలుష్యమే కారణమా..?

ఏలూరు వింత వ్యాధి బాధితులు (ఫైల్ ఫోటో)

ఏలూరు వింత వ్యాధి బాధితులు (ఫైల్ ఫోటో)

ఏలూరు పరిసరప్రాంతాల్లోని నీటి నమూనాల్లో ప్రమాదక రసాయనాలను డాక్టర్లు గుర్తించారు. నీటిలో 17వేల రెట్లు అధికంగా రసాయనాలున్నట్లు వెల్లడైంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధిపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. అక్కడి ప్రజలు తాగే నీరు, పాలు, తినే ఆహార పదార్థాలను పరీక్షించిన వారు అవాక్కయ్యారు. స్థానికంగా ఉండే నీటి శాంపుల్స్ ని పరీక్షించగా.. వాటి రిజల్ట్ అందర్నీ షాక్ కు గురిచేసింది. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరీక్షించగా.. ప్రమాదకర స్థాయిలో హానికర రసాయనాలు, పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. అది కూడా పరిమితికి మించి వేల రెట్ల అధిత మోతాదులో ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కృష్ణా కాలువ నుంచి తీసిన నీటి శాంపిల్స్ లో 17.84 మిల్లీ గ్రాముల మెథాక్సిక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. సాధారణంగా ఈ కెమికల్ 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉంటే పెద్దగా ప్రభావం చూపదు అంతకంటే ఎక్కువైతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

కృష్ణా, గోదావరి కాలువల్లో అలాక్లార్‌ లీటర్‌ నీటిలో సగటున 10 మిల్లీ గ్రాములకు పైగా ఉండగా.. పెన్షన్‌ లైన్ నీళ్లలో అలాక్లోర్‌ 14 మి.గ్రాములు, ఓపీ-డీడీటీ 15 మి.గ్రా, జేపీ కాలనీలో పీపీ-డీడీఈ 14 మి.గ్రా, ఓపీ-డీడీటీ 15 మి.గ్రా, గాంధీ కాలనీలో ఓపీ-డీడీడీ 14 మి.గ్రా, పీపీ-డీడీడీ 15 మి.గ్రా, రామచంద్రరావుపేటలో అలాక్లోర్ 10 మి.గ్రా, ఓపీ-డీడీఈ 13.37 మిల్లీగ్రాములున్నట్లు తేలింది.

ఏమవుతుంది..?

ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న నీటిలో 17,640 రెట్లు అధికంగా హానికరమైన మెథాక్సీక్లర్ ఉన్నట్లు తేలడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఈ రసాయనం శరీరంలోకి వెళ్తే దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశముందని తెలిపారు. ఈ వింత వ్యాధికి ప్రధాన కారణం నీరు లేదా ఆహారం కలుషితం కావడమేనని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. జనం అస్వస్థతకు గురవడానికి వాతావరణ సమస్య కానేకాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వింత వ్యాధి వ్యాఫించిన ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని నీరు, కూరగాయలు, ఆహార పదార్థలను ల్యాబ్ లో పరీక్షిస్తున్నారు.

కాలుష్య కాసారం

ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే ప్రధాన కాలువ ఏలూరు కాలువ. కృష్ణానది నుంచి వెళ్తున్న ఈ కాలువ నిత్యం కలుషితమవుతూనే ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ప్రవహించే ఈ కాలువ మార్గ మధ్యలో పంట పొలాలు, పరిశ్రమల నుంచి రసాయనాలు కాలువలో కలుస్తున్నాయి. అంతేకాకుండా కాలువ చుట్టపక్కల ప్రాంతాలవారు చెత్తను కూడా డంప్ చేస్తున్న దాఖలాలున్నాయి. దీంతో ఈ నీరు అత్యంత ప్రమాదకరంగా మారి ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ ఏలూరులో 583 మంది ఫిట్స్, వాంతులు, వికారం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీళ్లలో 470 మంది డిశ్చార్జ్ అవగా... 20 మంది బాధితులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. రోగుల నుంచి తీసుకున్న బ్లడ్ శాంపిల్స్ లో నిఫోసకెల్, సీసం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.

First published:

Tags: Andhra Pradesh, Cancer, Eluru, West Godavari

ఉత్తమ కథలు