హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఏపీలో మరో ఘటన.. హిందూ సంఘాల ఆగ్రహం

హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఏపీలో వరుస ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

 • Share this:
  ఏపీలో ఆలయాల చుట్టూ వివాదం ముదురుతోంది. అంతర్వేదిలో రథం దగ్ధం, ఇంద్రకీలాద్రిలో వెండి సింహాలు మాయంపై దుమారం రేగుతున్న సమయంలోనే.. ఆలయాల్లో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో విగ్రహం విధ్వంసం అయింది. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో దుండగులు హనుమాన్‌ విగ్రహాం చేయిని విరగ్గొట్టారు. ఏలేశ్వరం శివాలయం వద్ద బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికులు, హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  మంగళవారం అర్ధరాత్రి విజయవాడ రూరల్ మండలంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని విరగగొట్టారు. స్థానికులు, ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వెంటనే పాడైన విగ్రహం స్ధానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  మరోవైపు కాగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాలు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని తెలుస్తోంది. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైంది. కానీ ఈవో మాత్రం వెండి పూతే ఉంటుందని చెబుతున్నారు. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది. వరుస ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: