Anna Raghu, Guntur, News18
ప్రజాప్రతినిథి అంటే.. చుట్టూ మంది మార్బలం. అనుచరులు, కార్యకర్తల హడావిడి ఉంటుంది. అలాంటి సమయంలో ప్రతి పనిని వారే చూసుకోవడం చాలా కష్టం. అందుకని పీఏలను పెట్టుకుంటారు. పీ.ఏ అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంతటివారు. తమకు బాగా నమ్మకస్తులైన వారినే నేతలు తమ పీఏలుగా పెట్టుకుంటారు. కానీ వారితో తేడా వస్తే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రస్తుతం ఆలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వచ్చింది. పీ.ఏలు తప్పుచేశారని వాళ్లని వెళ్లగొడితే.. ఇప్పుడు వాళ్లతోనే సమస్య వచ్చిపడింది. వివరాల్లోకి వెళ్తే.. రాజధాని జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పేరు వాడుకుని అతని ఇద్దరు పి.ఏ లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, విషయం తెలిసి సదరు యం.ఎల్.ఏ వారిద్దరిని చితకబాది వారిని కొలువుల నుండి పీకేశారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు పి.ఏ ల అవినీతి,అక్రమాలపై రహస్యంగా విచారణ జరపి తనకు తెలియజేయాలని సదరు యం.ఎల్.ఏ ఓ పోలీస్ అధికారిని పురమాయించారట. ఐతే సదరు పొలీసు అధికారి విచారణలో పిఏల అవినీతికంటే ఎమ్మెల్యేగారి అవినీతి భాగోతాలు ఎక్కువ బయట పడతుండటంతో ఏంచేయాలో పాలుపోక సదరు పోలీసు అధకారి విచారణను ఆపేశారని ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడికైనా అతని పి.ఏలు, డ్రైవర్లు ఏళ్ళ తరబడి అత్యంత నమ్మకంగా పనిచేస్తుంటారు. నాయకులు చేసే ప్రతి పని అది మంచైనా, చెడైనా వీరికి తప్పకుండా తెలుస్తుంది. కానీ వీరు స్వామి భక్తితో వారి అవినీతి, అక్రమాలు అన్ని కడుపులో దాచుకుని వారికి నమ్మకంగా సేవ చేస్తుంటారు. వీరిలో కొంతమందికి అయ్యవారి ఆర్ధిక లావాదేవీల మీద కూడా అవగాహన ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొందరు సార్ కోట్లు వసూలు చేస్తుంటే తాము లక్షలు తీసుకోవడంలో తప్పేముందని భావిస్తుంటారు. తమ వద్దకు వచ్చిన చిన్న చిన్న పంచాయితీలను స్థానిక రెవెన్యూ,పోలీసు అధికారులతో మాట్లాడి సెటిల్ చేస్తుంటారు. వారికి లబ్దిదారులు ఎంతో కొంత ముట్టచెబుతుంటారు.
ఐతే కొంత మంది పి.ఏ లు అధికారులను బెదిరించి తమకు కావలసిన పనులు చక్కబెట్టుకుంటూంటారు. వారి పని చేయని అధికారులపై నాయకులకు లేని పోనివి కల్పించి వారిని ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందుకని చాలామంది అధికారులు పి.ఏ ల వ్యవహారాలలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారు. సరిగ్గా దీన్నే అదునుగా తీసుకున్న సదరు ఇద్దరు పి.ఏలు భారీగా వసూళ్ళకు పాల్పడటమే కాకుండా ఆస్తులను కూడ బెట్టినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే కొంతమంది మహిళా సిబ్బందిని బెదిరించి లోబరుచుకున్నారనే ప్రచారమూ లేక పోలేదు. ఈ వ్యవహారాలు బయటికి పొక్కితే తనకి లేని పోని ఇబ్బందులు వస్తాయని భావించిన సదరు ఎమ్మెల్యేగారు తన ఇద్దరు పి.ఏ లని చితకబాది బయటికి పంపించివేశారని, ఐతే వారు ఇదంతా మనసులో పెట్టుకుని తన అవినీతి చిట్టా ప్రత్యర్ధుల దగ్గర విప్పుతారేమోనని సదరు ఎమ్మెల్యే ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారంట.
ఈ పరిణామాలను దగ్గరి నుండి గమనించిన మరికొందరు సహాయకులు, సలహాదారులు కూడా రేపు మనగతి కూడా ఇంతేనేమో అనే భయంతో అయ్యవారి వద్ద కొలువులు మానేసి వెళ్ళిపోయారంట. ఏది ఏమైనా పెద్దవాళ్ళతో వ్యవహారం చిన్నా చితక ఉద్యోగులకు ప్రాణ సంకటమని., అవినీతి తాము చేస్తే సంసారం తన పి.ఏ లు చేస్తే వ్యభిచారం అన్న చందంగా వ్యవహరించడం పట్ల ఆ నియోజకవర్గంలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.
వేటుకు గురైన పీఏల్లో ఒకరు ఎమ్మెల్యే సొంతసామాజిక వర్గమే కావడంతో కులపెద్దల ద్వారా రాయబారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే తనను నమ్మించి మోసం చేసిన సదరు పి.ఏ పట్ల ఎమ్మెల్యే సానుకూలంగా లేకపోయినా.. తన గుట్టు ఎక్కడ విప్పుతాడోనన్న భయంతో చేరదీయక తప్పనిపరిస్థితి నెలకొంది. ఇక రెండో పి.ఏ మాత్రం తాను ఏంచేయాలో తెలియని పరిస్థితులలో తన స్వగ్రామానికి వెళ్ళి పోయాడనే ప్రచారం నియోజకవర్గంలో జోరందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Ysrcp