Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలిలో (Legislative Council) ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటా ఎన్నికల హడావిడి నెలకొంది. మొత్తం 14 స్థానాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఖాతాలో చేరడం ఖాయమైంది. ఇప్పటికే 14 మందిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. జిల్లాల వారీగా సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వైసీపీ తెలిపింది. ఐతే ఎమ్మెల్సీ పదవుల విషయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ నేతకు అన్యాయం జరిగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలికీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan Mohan Reddy) విధేయుడిగా ఉన్నా ఆ నేతకు మాత్రం పదవీయోగం దక్కలేదని అనుచరులు అంటున్నారు. ఆయనే వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్.
గుంటూరు జిల్లా (Guntur District) చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మర్రి రాజశేఖర్.. సీఎం జగన్ విజ్ఞప్తి మేరకు త్యాగం చేశారు. ఆ సమయంలోనే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తామని సీఎం జగన్ బహిరంగంగానే హామీ ఇచారు. ఏకంగా సీఎం హామీ ఇవ్వడంతో తొలుత ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి గ్యారెంటీ అని మర్రి రాజశేఖర్ భావించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైంది. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్సీ పదవుల భర్తీ జరిగింది. అయినా మర్రి రాజశేఖర్ కు మొండిచేయి తప్పలేదు. రాజశేఖర్ కు పదవి దక్కకపోవడంతో వైసీపీలోని పలు వాదనలు వినిపిస్తున్నాయి.
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, మర్రి రాజశేఖర్.. ఎన్నికల ముందు పార్టీ కోసం కలిసి పనిచేశారు. ఒకప్పుడు పాలు-పంచదార మాదిరిగా కలిసి పనిచేసిన వీళ్లిద్దరు.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఉప్పు-నిప్పులా మారారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో సహకరించినందుకు కృతజ్ఞత లేకుండా మర్రి రాజశేఖర్ ను టార్గెట్ చేశారని.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రాకుండా విడదల రజనీ అడ్డుకుంటున్నారని మర్రి వర్గం బహిరంగంగానే ఆరోపిస్తోంది. అలాగే ఎమ్మెల్యే రజనీకి ప్రభుత్వంలోనే ఓ ప్రముఖుడి అండదండలున్నాయని కూడా చెబుతున్నారు. అందుకే మర్రి రాజశేఖర్ కు పదవు రావడంలేదంటున్నారు.
వైఎస్ అనుచరుడిగా గుర్తింపు...
మర్రి రాజశేఖర్ కు వైఎస్ఆర్ అనుచరుడిగా గుర్తింపు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కీలక వ్యక్తి గా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోయినా కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. మాట ఇచ్చిన వాడు మనవాడైతే ఎక్కడున్నా వడ్డించక పోతాడా అంటూ ఎదురు చూశారు. గతంలో పదవుల భర్తీ సమయంలోనూ రాయబారులను పంపించి నెక్స్ట్ మీకే అంటూ ఆశలు కల్పించినా ఫలితం లేదని మర్రి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఎంతోమంది ఎమ్మెల్యేలున్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరూ వెళ్లి ఒక్కసారైనా అధినేత దగ్గరికి వెళ్లి ఆయనకు అండగా నిలవాలని ఆలోచన గాని, ధైర్యంగానీ చేయలేదని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap mlc elections, Guntur, Vidadala Rajani, Ysrcp