Anna Raghu, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) ఈపూరు మండలం బోడిశంభునిపాలెం ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. పగలంతా పొలంపనులు చేయడం సాయంత్రానికి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద కబుర్లు చెప్పుకోవడం వారికి అలవాటు. ఎప్పటిలాగే ఈనెల 21న సాయంత్రం వరకు అంతా రచ్చబండ వద్ద కబుర్లు చెప్పుకున్నారు. తర్వాతి రోజు ఉదయం వచ్చేసరికి ఓ యువకుడి ఉరేసుకొని చెట్టుకు వేలాడుతున్నాడు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఐతే అతడివద్ద లభించిన సూసైడ్ నోట్ ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టించింది. అది చదివిన వారు ఆ యువకుడి మృతదేహాన్ని చూసి ఎందుకిలా చేశావయ్యా అని బాధపడిన పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లకు చెందిన గోపిరాజు అనే యువకుడు వినుకొండలో జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు. కాసేపు స్నేహితులతో గడిపి ఇంటికి వెళ్తున్నాని చెప్పి వెళ్లాడు. తీరా చూస్తే తర్వాతి రోజు ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు.
ఐతే అందరూ ఏవేవో ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. కానీ అతడి సూసైడ్ నోట్ అందరికీ కన్నీరు తెప్పించింది. ముందుగా లెటర్ పై నా శవాన్ని తన అన్నకు అప్పగించాలంటూ పేరు, ఫోన్ నెంబర్ రాశాడు. ఆ తర్వాత తాను ప్రేమించిన అమ్మాయికి తన చివరి మాటలు చెప్పాడు.
ఏయ్ అమ్మాయ్ నువ్వే గెలిచావ్..! అంటూ తాను ప్రేమించిన అమ్మాయి గురించి రాస్తూ లేఖను మొదలుపెట్టాడు గోపి. “నేను జీవితంలో మొదటి సారి ఓడిపోయా... ఇక నీకు కనిపించనులే... నేను ఏ తప్పు చేయలేదు... నిన్నే భార్యగా ఊహించుకున్నా... నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను... నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి” అంటూ లేఖలో రాశాడు. ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ గోపీ ఆ అమ్మాయిని ఎంతగా ప్రేమించాడో ఊహించుకొని కన్నీరుమున్నిరయ్యారు.
ప్రేమించకపోతే చంపేస్తాం, పొడిచేస్తాం, యాసిడ్ పోస్తామంటూ బెదిరించే అబ్బాయిలున్న ఈరోజుల్లో ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నచ్చకో లేక, అమ్మాయి ఒప్పుకోలేదన్న మనస్తాపమో.. లేక మరేదన్న కారణం తెలియదుగానీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని గోపీ అన్నకు అప్పగించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో యువకుడు బీహార్ నుంచి గన్ తెచ్చిమరీ అమ్మాయిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Love failure