AP Capital Fight: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు ఇప్పుడు రాజధాని టర్న్ తీసుకున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati) ని కొనసాగించాలని టీడీపీ (TDP) సహా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అమరావతి రైతుల మహా పాదయాత్రకు (Amaravati Farmer Maha Padayatra) మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు అధికార వైసీపీ (YCP) మాత్రం.. మూడు రాజధానులే మా విధానం అంటోంది. ఇప్పటి వరకు ఆ విషయంలో కాస్త నెమ్మదిగా ఉన్న అధికార పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఏడాదికి విశాఖ నుంచే పాలన మొదలెట్టే ఆలోచనలో ఉంది. అయితే పాదయాత్రకు ధీటుగా.. ర్యాలీలు చేస్తున్నారు.
ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి కార్యచరణ అమలు చేశారు.. ఇక్కడే అదే దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అధికార వైసీపీ నేతలు.. మంత్రి బొత్స సైతం ఎప్పటికప్పుడు ఉద్యమ కార్యచరణపై ఇతర నేతలకు సూచనలు చేస్తున్నారు. అయితే వైసీపీ తీరును టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ప్రజల్లో తనపై వ్యతిరేకత వచ్చినప్పుడల్లా, దాన్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం అలవాటుగా చేసుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. తాను, తన ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీ, ప్రజాకంటకపాలన నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే చేతగాని దద్దమ్మలైన ముఖ్యమంత్రి, మంత్రులు మూడురాజధానుల రాగం ఆలపిస్తూ, వికేంద్రీకరణ జపంచేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : సైజుతో సంబంధం లేకుండా సెగలు పుట్టిస్తోంది..? బంగారంతో పోటీ పడుతున్న పులస
ఈ సన్నాసులంతా వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు పరిపాలనా వికేంద్రీకరణకు ఆద్యుడు నందమూరి తారకరామారావు అని తెలుసుకోవాలి అని సూచించారు. ప్రజల దగ్గరకు పాలన పేరుతో ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని ప్రజలకు చేరువచేసింది చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలు తమకు సమస్యవస్తే ఎక్కడికిపోవాలో, ఎవరికిచెప్పాలో తెలియక ఇబ్బందులుపడ్డారు. మండల వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు సుపరిపాలన అందించింది తెలుగుదేశంపార్టీ చేసిందాన్ని వికేంద్రీకరణ అంటారన్నారు.
ఇదీ చదవండి : కేసీఆర్ అందుకే ప్రధాని కావాలనుకుంటున్నారు..? యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మంత్రి బొత్స తప్పు పట్టారు. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 న ఉదయం 9 గంటల నుంచి విశాఖ ఎల్‌ఐసీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డు వరకు భారీ ప్రదర్శన ఉంటుందని బొత్స వెల్లడించారు. వికేంద్రీకరణపై మన ఆవేశాన్ని వ్యక్తపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముసుగులో గుద్దులాట అవసరం లేదని.. మరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ ఉందని తేలిపోయిందన్నారు. తనకు బుర్ర లేదన్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడికి బుర్ర ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధాని వికేంద్రీకరణ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటి ప్రశ్నలు వేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం టీడీపీ నేత అచ్చెన్నాయుడికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. అసలు ఆయన శ్రీకాకుళానికి ఏం చేశారన.. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా అని నిలదీశారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మంత్రి ధర్మాన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravathi, Andhra Pradesh, AP News, Botsa satyanarayana, Kinjarapu Atchannaidu, Ysrcp