అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో అక్రమ మద్యం రవాణా భారీగా జరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ప్రతి రోజూ సరిహద్దు గ్రామాల్లో వందలాది మద్యంబాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువకుల వ్యవహారం సంచలనంగా మారింది. తమ దగ్గర అక్రమ మద్యం లేకపోయినా పోలీసులు టార్గెట్ చేశారంటూ ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు మాత్రం కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని చెప్తున్నారు. చినికిచినికి గాలివానగా మారిన ఈ వ్యవహారంలో ఓ యువకుడు మృతి చెందడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో దాచేపల్లి మంటలం భట్రుపాడు వద్ద గురువారం రాత్రి ఇన్నోవా వాహనంలో వస్తున్న శ్రీకాంత్, అలిసా అనే యువకులను కాట్రపాడు కృష్ణానది కరకట్ట ద్వారా అక్రమ మద్యం తరలిస్తున్నారంటూ పోలీసులు అడ్డుకున్నారు. తాము వస్తున్నామన్న సమాచారంతో మద్యాన్ని ఎక్కడో దాచారంటూ వారిని అదుపులోకి తీసుకోని విచారించారు.
ఇంతలో శ్రీకాంత్, అలిసాతో పాటు మరికొందరు యువకులు తమపై దాడి చేశారంటూ ఎక్సైజ్ పోలీసులు పై అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో పై అధికారులు దాచేపల్లి సివిల్ పోలీసులకు మాచారమివ్వగా.. దాచేపల్లి ఎస్సై రహ్మతుల్లా అక్కడికి చేరుకొని యువకులను, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే తమ వద్ద మద్యం లేకపోయినా ఎక్సైజ్ సీఐ, దాచేపల్లి ఎస్సై తమపై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని యువకులు ఆరోపించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చిన మద్యం బాటిళ్లు తమ కారులో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఈ క్రమంలో తమను విచక్షణా రహితంగా కొట్టారని ఆరోపించారు.
అంతేకాదు పోలీసులు దాడిచేశారన్న మనస్తాపంతో శ్రీకాంత్, అలీసా పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఘటనలో అలిసా మృతి చెందగా.. శ్రీకాంత్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. పోలీసులు మాత్రం శ్రీకాంత్, అలీసా అక్రమ మద్యం తరలిస్తున్నట్లు ఆరోపిస్తుంటే.. వారు మాత్రం తమకేం సంబంధం లేదని పోలీసులే అబద్ధాలు చెప్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తో పాటు మరికొందరు యువకులు దాచేపల్లి పీఎస్ లో ఉన్నారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న బంధువులు దాచేపల్లి పీఎస్ వద్ద ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
నంద్యాలలో చేయని నేరానికి దొంగ అనే ముద్ర వేసి వేధించి అబ్దుల్ సలామ్ కుటుంబాన్ని బలితీసుకున్న @ysjagan ప్రభుత్వం, ఇప్పుడు మరో మైనార్టీ సోదరుడు అలీషాని అన్యాయంగా చంపేసింది. గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మద్యం తరలిస్తున్నారనే నెపంతో అలీషాని కొట్టి..(1/3) pic.twitter.com/xU8PaqO27n
— Lokesh Nara (@naralokesh) August 6, 2021
ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. వైసీపీ ప్రభుత్వం అమాయకలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ప్రజలకు హానికరమైన మద్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు నేరుగా వారి ప్రాణాలు తీస్తోందని ఆరోపించారు. అలీసా కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Guntur