GUNTUR TELUGU DESHAM PARTY FACING LEADERSHIP PROBLEM IN THIS CONSTITUENCY OF GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN BK
TDP: కేడర్ ఉన్నా కనిపించని లీడర్లు... ఆ నియోజకవర్గంలో సైకిలెక్కే నేతలే లేరా..?
ప్రతీకాత్మకచిత్రం
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు దేశం పార్టీ (Telugu Desham Party) బలోపేతం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న చంద్రబాబు (Nara Chandra Babu Naidu) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగు దేశం పార్టీ బలోపేతం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న చంద్రబాబు ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. బలమైన పార్టీ క్యాడర్ ఉన్న నియోజకవర్గ, జిల్లా పార్టీ సారథుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నామమాత్రంగా పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ క్యాడర్ మాత్రం వింత పరిస్థితి ఎదుర్కొంటుంది. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో పార్టీ నేతలు సారథి లేకుండానే పార్టీ కార్యకర్తలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లీడర్ లేని పార్టీ విచ్చినం అవుతుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణానంతరం చుక్కాని లేని నావలాగా అయింది పార్టీ పరిస్థితి. పార్టీ కార్యకర్తలు నడుమ నిశబ్ద వాతావరణం తప్ప వేరొకటి లేదు. 2019 ఎన్నికల అనంతరం సత్తెనపల్లి పార్టీ క్యాడర్ మూగబోడానికి కారణం ఒకటి శివప్రసాద్ మరణం అయితే మరొకటి పార్టీ అత్యంత ఘోర పరాభవం పొందడమే.
2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు, మాజీ స్పీకర్ కోడెల మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ పోటీలో కోడెల శివప్రసాదరావు ఓటమి పాలయ్యారు. అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోడెల మరణానంతరం సత్తెనపల్లిలో నాయకత్వలేమి కనిపించింది. దీంతో కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామ్ కు పార్టీ బాధ్యతలు ఇస్తారని అందరూ భావించారు. ఐతే అధికారంలో ఉండగా శివరామ్ తీవ్ర ఇబ్బంది పెట్టారని సత్తెనపల్లి పార్టీ నాయకులు అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో పార్టీ అధినేత నియోజకవర్గ పదవిని ఎవరికి కట్టబెట్టలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.
సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్ కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ప్రయత్నాలు చేశారు. 2019ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు రంగారావు ఆసక్తి చూపారు. కుమారుడి కోసం తన ఎంపీ సీటును సైతం వధులుకొనేందుకు సాంబశివరావు సిద్ధమైనా.. కోడెల అక్కడ నుంచి పోటీ చేస్తానని పట్టుపట్టడంతో రంగారావు ఆశ నెరవేరలేదు. అయితే తనకు ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వాలని కోరుతూ రాయపాటి రంగారావు నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. ఇక స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చూరుగ్గా పాల్గొంటూ తానే ఇంఛార్జ్ అని చెప్పకనే చెప్పారు. తనకు నియోజకవర్గ పగ్గాలు కట్టబెడితే పార్టీని బలోపేతం చేస్తానని చంద్రబాబు వద్ద ప్రతిపాదన ఉంచారు. ఈ అంశంపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ఇప్పుడు అధిష్టానం నాన్చుడు ధోరణి చూసి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను నడిపే సారథి లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ వైవీ ఆంజనేయులు ఆకస్మిక ఎంట్రీతో ఇప్పుడు ఇంచార్జ్ పదవి మరోసారి చర్చనీయాంశమైంది. 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆంజనేయులు ఆ తరువాత పార్టీకి దూరమయ్యారు. పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోక పోవడంతో అధిష్టానం దృష్టిలో పడేందుకు పావులు కదుపుతున్నారు. లీడర్ లేని నియోజకవర్గం కావడంతో అక్కడ తను పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానికంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులను చూసిన ఆంజనేయులు అధిష్టానం వద్ద మంచి పెరు తెచ్చుకొనే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇక మున్సిపాల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. అధినేత ఆలోచిస్తే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం అని ఆయన చంద్రబాబును కలిసి చెప్పారని సమచారం.
నడిపించే నాయకుడు లేకపోవడంతో ఇప్పటికే సత్తెనపల్లి తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో కలిసికట్టుగా పాల్గొనడం దాదాపు మానేశారు. ఒక్క నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులు ఉన్నాయంటేనే తెలుస్తోంది పార్టీలో చీలికలు ఏస్థాయిలో ఉన్నాయో. ఇలాంటి ప్రాంతల్లో పార్టీ పదవులను చంద్రబాబు అంత తేలికగా తేల్చరనే ప్రచారం కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సైకిల్ ను నడిపించే సారథిగా ఎవరుంటారు..? కోడెల కుటుంబం పట్టు ఉంటుందా..? రాయపాటి రాయబారం వర్కవుట్ అవుతుందా..? లేక జీవీనే పాగా వేస్తారా..? అనేది వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.