Home /News /andhra-pradesh /

GUNTUR TDP LEADERS SLAMS AP GOVERNMENT FOR SAND EXCAVATION WORKS TO JP POWER NGS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం మరో క్విడ్ ప్రో కోకి తెర: జేపీ పవర్ వెంచర్స్ కు ఇసుక తవ్వకాల అప్పగింతపై తీవ్ర విమర్శలు

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

ఏపీలో మళ్లీ ఇసుక దుమారం రేపుతోంది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ కు ఇసుక తవ్వకాలను అప్పగించడంపై విపక్షలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం మరో క్విడ్ ప్రో కో కి తెరలేపందని మండిపడుతున్నాయి.

  ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీవ్ర దుమారం లేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్ ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్ర‌భుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అధికారికంగా కట్టబెట్టింది. దీనిపై విపక్షలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇటు సామాన్య ప్రజలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక రీచ్ తవ్వకాలకు అనుమతి ఇస్తే భారీగా ధలు పెంచేస్తారని.. కేవలం డబ్బులు ఉన్నవారికే ఇసుక అందుతుందని ఆందోళన చెందుతున్నారు.

  ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణని 'జయప్రకాష్ పవర్ వెంచర్స్ కట్టబెట్టడం దారుణమన్నారు. సుమారు 3 వేల 500 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీకి తవ్వకాలు ఇవ్వడం వెనుక ఏ మర్మం ఉందని ఆయన ప్రశ్నించారు. తమ కేసుల్లో ఉన్న వారికి ఇవి గుప్తదానం చేయడం క్విడ్ ప్రో కిందకు వస్తుందని ఆరోపించారు. మొత్తానికి ప్రజలకి మాత్రం ఇసుమంతైన ఇసుక దొరకకుండా చేయడమే సీఎం లక్ష్యమా అని ప్రశ్నించారు.

  విపక్షాలు దీన్ని క్విడ్ ప్రోకో అని ఆరోపిస్తుంటే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం టెండర్లను ఢిల్లీకి చెందిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కి ఏపీ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ సంస్థ దేశంలోనే అతిపెద్దదైన హైడ్రోఎలక్ట్రిక్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేందాన్ని నిర్వహిస్తోందని.. మూడు ప్యాకేజీలకు జేపీ పవర్‌ ఎక్కువ ధర కోట్‌ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ దానికే టెండర్లు ఖరారు చేసిందని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది అంటున్నారు అధికారులు. గతేడాది కంటే ఇది 20 శాతం అధికమంటున్నారు.

  మొత్తంగా మూడు సంస్థల సాంకేతిక, ఆర్థిక అర్హతలను పరిశీలించి ఎక్కువ ధర కోట్‌ చేసిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌కు టెండర్‌ను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ సంస్థ ఒకటో ప్యాకేజీకి 477.50 కోట్లు, రెండో ప్యాకేజీకి 745.50 కోట్లు, మూడో ప్యాకేజీకి 305.60 కోట్లను కోట్‌ చేయగా.. మిగిలిన రెండు సంస్థలు అంతకంటే తక్కువ ధర కోట్‌ చేశాయి. దీంతో రెండేళ్లపాటు జేపీ పవర్‌ ఇసుక తవ్వకాలను నిర్వహించేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 161.30 కోట్ల రూపాయలు రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 380 కోట్ల నికర ఆదాయం వచ్చింది. కాగా టెండర్‌ను దక్కించుకున్న జేపీ గ్రూప్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే ప్రముఖ ప్రైవేటు సంస్థగా గుర్తింపు పొంది. విద్యుత్‌ రంగంలోనే కాకుండా సివిల్‌ ఇంజనీరింగ్, నిర్మాణం, సిమెంట్, రోడ్ల నిర్మాణం, ఆతిథ్యం, ఎరువులు, ఆరోగ్య సంరక్షణ, క్రీడా, విద్యా రంగాల్లోనూ ఈ సంస్థ పనిచేస్తోంది.

  ఇకపై ఇసుకకోసం ఆన్ లైన్ అప్లికేషన్లు అవసరం లేదంటోంది ఆ సంస్థ. రీచ్‌ల దగ్గరే స్టాక్‌ యార్డ్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఇసుకను తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్‌ వద్ద ఒకే ధర ఉంటుంది. దూరం ఆధారంగా, ప్రాంతాల వారీగా అప్పర్‌ సీలింగ్‌తో ఒక ధర నిర్ణయిస్తారు. ఒకవేళ ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి.. టోల్ ఫ్రీ ఫోన్‌ నంబర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదంటున్నాు. దీనికితోడు ఇసుక సరఫరాలో రవాణా కాంట్రాక్టర్, దళారీల ప్రమేయం ఉండదని అధికారులు అభిప్రయపడుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

  మీ నగరం నుండి (​విజయవాడ)

  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  ఆంధ్రప్రదేశ్
  ​విజయవాడ
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Buchaiah chowdary, Sand crisis, Sand issue, Sand mafia, Sand shortage, Tdp

  తదుపరి వార్తలు