ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తాారాస్థాయికి చేరుతోంది. ఓవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాటలతూటాలు పేలుతుంటే.. మరోవైపు అక్రమ అరెస్టుల వ్యవహారం కాకరేపుతోంది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గుంటూరుజిల్లా పొన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్రది రాజకీయ చరిత్ర కుటుంబమని.. ఆయన తండ్రి నుంచి ఇక్కడి ప్రజలకు సంగం డెయిరీ రైతాంగానికి అండగా ఉంటున్నారన్నారు. కొన్నిదశాబ్దాలుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవచేశారన్నారు. ఇలాంటి పరిస్థితులు తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్న చంద్రబాబు.. విలువలు లేని కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. సంగం, విశాఖ డెయిరీలు చట్టప్రకారం బదిలీ అయ్యాయన్నారు. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మించి సేవలందిస్తోందన్న చంద్రబాబు పేర్కొన్నారు. అలాంటి సంగం డెయిరీని ఆక్రమించుకునేందుకు ఎలాంటి తప్పుచేయని ధూళిపాళ్ల నరేంద్రను.. నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసే వారు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి అవినీతిని ప్రశ్నించే వారిని ప్రజలను డైవర్ట్ చేయడానికి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అందరూ వైసీపీ నేతల మాదిరిగా తప్పుడు మనుషులు లేరన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. దీనిని విచారించాలంటే కోర్టులు కూడా చాలవని ఎద్దేవా చేశారు.
గత పదేళ్లలో ధూళిపాళ్ల నరేంద్ర ఆస్తులు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంతమేర పెరిగాయో ప్రజలు చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారపార్టీ బెదిరింపులకు లొంగకపోవడంతోనే దూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ చేయవద్దని సుప్రీం చెప్పినా ప్రభుత్వం అరెస్టులు చేయిస్తోందని.. ఉన్మాది పాలనలో పోలీసులు కూడా అలాగే తయారయ్యారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని బాబు స్పష్టం చేశారు.
రాయలసీమలో హత్యా రాజకీయాలు, ముఠా కక్షలకు చరమగీతం పాడితే.. ఈ ప్రభుత్వం మళ్లీ వాటిని ప్రోత్సహిస్తోందవని.. గతంలో తాము ఇలాగే చేసుంటే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి ఉండేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సర్పంచ్ అధికారాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని.. దీనిపై కోర్టు అక్షింతలు కూడా పడ్డాయన్నారు. స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనే లక్ష్యంతో నరేగా నిధులు నేరుగా పంచాయతీలకు ఇస్తున్నారని.. కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం ఏపీలో వాళ్ల సచివాలయం పెడితే ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా హక్కులు కోపాడుకోవాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP